అందుకే కాంగ్రెస్ తొందరపడిందా?

December 11, 2017


img

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన మొక్కుబడి ఎన్నికలలో రాహుల్ గాంధీ ఒక్కరే నామినేషన్ వేశారు కనుక అయన ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఈరోజు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అధారిటీ ప్రకటించబోతోంది. ఈ నెల 16వ తేదీన రాహుల్ గాంధీకి దృవీకరణ పత్రం అందజేస్తామని కాంగ్రెస్ ఎన్నికల అధారిటీ అధ్యక్షుడు ఎం.రామచంద్రన్ చెప్పారు. అంటే డిసెంబర్ 16న రాహుల్ గాంధీ చేతికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నట్లు చెప్పవచ్చు. 

డిసెంబర్ 18వ తేదీన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కార్ ఓడిపోయే అవకాశాలున్నాయని సర్వేలు సూచిస్తున్నాయి. కానీ భాజపాకు కంచుకోట వంటి గుజరాత్ రాష్ట్రంలో 50 శాతం విజయావకాశాలున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. ఒకవేళ గుజరాత్ లో కాంగ్రెస్ గెలిస్తే అది రాహుల్ గాంధీకి అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత తొలికానుక, తొలివిజయం అవుతుంది. లేకుంటే షరా మామూలుగా మరో ఓటమిని ‘కాంగ్రెస్ పద్దు’లో వ్రాసేసి ముందుకు సాగక తప్పదు. 

బహుశః ఆ ఓటమి భయంతోనే ఎన్నికల ఫలితాలు వెలువడటానికి రెండు రోజుల ముందుగానే పార్టీ పగ్గాలు చేపడుతున్నారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తరువాత పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించినట్లయితే, పార్టీలో సీనియర్లు మళ్ళీ రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలను ప్రశ్నిస్తూ వారు కూడా నామినేషన్ వేసే ప్రమాదం ఉంటుంది. కనుక ఫలితాలు వెలువడక ముందే తూతూ మంత్రంగా ఎన్నికలు నిర్వహించేసి రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పజెప్పేసినట్లయితే, ఒకవేళ ఈ ఎన్నికలలో ఓడిపోయినా కూడా పార్టీలో ఎవరూ ఆయనను ప్రశ్నించే సాహసం చేయలేరు. చేస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు.     



Related Post