ఆ విషయంలో కెసిఆర్ కు మరెవరూ సాటిరారు

December 09, 2017


img

ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు అధికారులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు నిత్యం అనేక ఆదేశాలు ఇస్తూ పనులు జరిపించడం సర్వసాధారణమైన విషయం. అదేవిధంగా వివిధ సందర్భాలలో స్వంత పార్టీ నేతల నుంచి లేదా ఇతర పార్టీల నేతల నుంచి సహాయసహకారాలు పొందుతుంటారు. అయితే చాలా మంది ముఖ్యమంత్రులు అది తమ హక్కు వారి విధి అన్నట్లుగానే వ్యవహరిస్తారు తప్ప వారి చేసిన పనిని మెచ్చుకోరు. కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ అందుకు పూర్తి భిన్నం. తన అధికారులలో నిజాయితీగా పనిచేసేవారిని గుర్తించడమే కాకుండా, అదే విషయం బహిరంగంగా అందరి ముందు చెప్పి ప్రశంసిస్తారు. అవసరమైతే లేదా వీలైతే వారు పదవీ విరమణ చేసిన తరువాత కూడా వారికి ఏదో ఒక పదవి కట్టబెట్టి వారి సేవలను ఉపయోగించుకొంటారు. మాజీ ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ శర్మ, మాజీ డిజిపి అనురాగ్ శర్మలు పదవీ విరమణ చేయగానే వారిని వెంటనే ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకోవడాన్ని అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

ఇక అధికారులు, ఇంజనీర్లు, మంత్రులు, ప్రజా ప్రతినిధులలో బాగా పనిచేస్తున్నవారిని కూడా నలుగురిలో మెచ్చుకొని ప్రోత్సహించడం ముఖ్యమంత్రి కెసిఆర్ కు అలవాటు. ఆ కారణంగానే అందరూ అయనను మెప్పించే విధంగా పనిచేసేందుకు పోటీలు పడుతుంటారు. 

ఈరోజు ప్రగతి భవన్ లో కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిపిన సమీక్షా సమావేశంలో సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావును, ఆ శాఖ, విద్యుత్ శాఖ అధికారులపై ప్రశంసల వర్షమే కురిపించారు. సాగునీటి ప్రాజెక్టుల ఎదురవుతున్న అవరోధాలను అధిగమించుతూ మంత్రి హరీష్ రావు చాలా చురుకుగా పనులు జరిపిస్తున్నారని మెచ్చుకొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణా ప్రజలందరూ హరీష్ రావుపై కోటి ఆశలు పెట్టుకొన్నారని వాటిని నిలబెట్టుకొనే బాధ్యత ఆయనపైనే ఉందని మెచ్చుకొంటూనే అయన బాధ్యతలను గుర్తు చేశారు. అలాగే ఒకప్పుడు విద్యుత్ కోతలతో అల్లాడిన తెలంగాణాకు వాటి నుంచి విముక్తి కల్పించడంలో విద్యుత్ శాఖ అధికారులు చాలా కృషి చేశారని అందుకు వారిని అభినందిస్తున్నానని కెసిఆర్ అన్నారు. 

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తన క్రింద పనిచేస్తున్న మంత్రులు, అధికారులపై ఎప్పుడూ చిందులు వేయడమే చూస్తుంటాము తప్ప ఈవిధంగా ప్రశంసించడం చాలా అరుదుగా చూస్తాము. సాక్షాత్ ముఖ్యమంత్రే తమ పనితీరును మెచ్చుకొంటే వారికి అంతకంటే సంతృప్తి ఏముంటుంది? 

ముఖ్యమంత్రి కెసిఆర్ గురించి చెప్పుకోవలసిన మరొక గొప్ప సుగుణం కూడా ఉంది. ఆనాడు తెలంగాణా రాష్ట్రం కోసం తన నాయకత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతొ పోరాడి సాధించుకొన్నప్పటికీ, తెలంగాణా రాష్ట్రాన్ని సోనియాగాంధీయే ఇచ్చారని నిర్మొహమాటంగా శాసనసభలో చెప్పడమే కాకుండా ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకోవడం అందరికీ తెలుసు. ఒక రాజకీయ నాయకుడు మరొక పార్టీకి చెందిన నాయకుడి గొప్పదనాన్ని అంగీకరించడం, చేసిన సహాయానికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపడం బహుశః కెసిఆర్ ఒక్కరికే చెల్లునేమో? అందుకే అయన వర్తమాన రాజకీయ నాయకులలో ఎప్పుడూ ఒకమెట్టుపైనే కనబడుతుంటారు.


Related Post