మోడీ చురకలు మనకీ వర్తిస్తాయి

December 09, 2017


img

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం గుజరాత్ లోని లూనావాడాలో ఎన్నికల ప్రచారసభలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “గతంలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనైనా ఇంతవరకు ఇచ్చిందా లేదు? ఎన్నికలలో గెలిచి అధికారం చేజిక్కించుకోవడం కోసమే అది ఆవిధంగా బూటకపు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టింది. 

మళ్ళీ ఇప్పుడు గుజరాత్ లో కూడా పటేల్ కులస్తులకు రిజర్వేషన్లు కల్పిస్తామని మభ్యపెడుతోంది. కానీ ఇక్కడ కూడా ఇవ్వదు. ఇవ్వలేదు కూడా. అది ఎస్సీ,ఎస్టీ, బిసి కోటాలో కత్తిరించి రిజర్వేషన్లు ఇస్తుందా? లేక ఇచ్చే ఉద్దేశ్యం, అవకాశం లేకపోయినా ఓట్ల కోసం ప్రజలను మళ్ళీ మభ్యపెడుతోందా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశ్యం, అవకాశం ఉండి ఉంటే, మాట ప్రకారం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇచ్చి ఉండాలి కదా? కానీ ఇవ్వలేదంటే అర్ధం ఏమిటి? అది ప్రజలను మోసం చేస్తోందనే కదా?” అని ప్రశ్నించారు. 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపిస్తే పటేల్ కులస్తులను స్పెషల్ కేటగిరీ క్రింద పరిగణించి రిజర్వేషన్లు కల్పిస్తామని పటేల్ కులస్థుల యువనేత హార్దిక్ పటేల్ కు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అయితే 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలులేదని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి హార్దిక్ పటేల్ కు కూడా తెలుసు. కనుక కాంగ్రెస్ పార్టీ తన హామీని నిలబెట్టుకోలేదని కూడా ఖచ్చితంగా అతనికి తెలుసు. కానీ మోడీ, భాజపాలపై ద్వేషంతోనే రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నారు. ఆ ప్రయత్నంలో రాహుల్ గాంధీ చేస్తున్న మోసపూరిత వాగ్దానాలలో అతను   కూడా భాగస్వామిగా మారి రాష్ట్రంలో తన కులస్తులను మోసం చేస్తున్నట్లే చెప్పవచ్చు. 

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ చేస్తున్న ఈ వాదనలు, వాటి ప్రభావం కేవలం అక్కడికే పరిమితం కాబోవు. రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా వర్తింపజేసి చూడవచ్చు. తెరాస సర్కార్ ముస్లింలకు 12, ఏపి సర్కార్ కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చాయి. 

మతప్రాపదికన (ముస్లింలకు) రిజర్వేషన్లు కల్పించడాన్ని భాజపా వ్యతిరేకిస్తున్నప్పుడు, 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చే అవకాశంలేదని తెలిసి ఉన్నప్పుడు, రాష్ట్రంలో ముస్లింలకు రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇవ్వడమే కాకుండా, దాని కోసం శాసనసభలో ఒక తీర్మానం ఆమోదింపజేసి కేంద్రానికి పంపించారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఇంత బహిరంగంగా చెపుతున్నపుడు, కెసిఆర్ ఏవిధంగా తన హామీ నిలబెట్టుకోగలరు? ఆ హామీని నిలబెట్టుకోవడం సాధ్యం కాదని తెలిసినా ఇంకా ఇస్తామని ముస్లింలకు భరోసా ఇస్తుండటాన్ని ఏమనుకోవాలి? ఇదే ప్రశ్నలు ఏపి సిఎం చంద్రబాబుకు వర్తిస్తాయి. 


Related Post