ఇదేమి వితండవాదం వరవరరావుగారు?

December 09, 2017


img

ఈ నెల 15 నుంచి హైదరాబాద్ లో జరుగబోతున్న ప్రపంచ తెలుగు మహాసభల గురించి విరసం నేత వరవరరావు చెప్పిన మాటలు వింటే నవ్వురాకమానదు.

“ఈ సభలు అగ్రవర్ణ భూస్వామ్య భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఉద్దేశ్యించినవి. ఇంకా చెప్పాలంటే ఇటీవల హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు కొనసాగింపువంటివి. కనుక వాటిని మేము వ్యతిరేకిస్తున్నాము. ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో మాట్లాడే తెలుగు వేరన్న కెసిఆర్ ఇప్పుడు వాటిని ఎందుకు నిర్వహిస్తున్నారు?” అని అన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభలు ఈరోజు కొత్తగా మొదలైనవి కావు. వాటిలో తెలుగు బాష, సాహిత్యం, కళలకు సంబందించిన అంశాలపై చర్చలు, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి తప్ప రాజకీయ చర్చలు జరుగవని వరవరరావుకు తెలియదనుకోలేము. తెలుగు సాహిత్యమనే జీవనదిలో ప్రాచీన సాహిత్యం మొదలు నేటి ఆధునిక సాహిత్యం వరకు ఉపనదుల వంటి అనేక సాహిత్య ప్రక్రియలు అందంగా ఇమిడిపోయున్నాయి. దానిలో విరసం (విప్లవ రచయితల సంఘం), వామపక్ష సాహిత్యం, మావోయిస్ట్ సాహిత్యం వంటివి కూడా ఉన్నాయనే విషయం బహుశః వరవరరావుకు గుర్తున్నట్లు లేదు. 

రెండు తెలుగు రాష్ట్రాలలో మాట్లాడే తెలుగు, యాస వేరనే సంగతి అందరికీ తెలుసు. కెసిఆర్ కూడా అదే చెప్పారు తప్ప అయన కొత్తగా కనిపెట్టి చెప్పింది కాదు. శ్రీకాకుళంలో తెలుగు యాస ఒకవిధంగా ఉంటే, ఉభయగోదావరి జిల్లాలలో మరొకలా, నెల్లూరు చిత్తూరు జిల్లాలలో మరొకలాగ.. తెలంగాణాలో మరొకలాగ ఉంటుంది. అది తెలుగుబాష విస్తృతికి, ఒకే బాషలో భిన్న రూపాలకు అద్దంపడుతోందని గ్రహిస్తే వరవరరావు ఈవిధంగా మాట్లాడి ఉండరు. తెలంగాణా మాండలికంలో ఎంత మాధుర్యం ఉందో కెసిఆర్ ప్రసంగాలు వింటే అర్ధం అవుతుంది. అదేవిధంగా ఉభయ గోదావరివాసుల మాటలు వింటే అందులో తీయదనం అర్ధం అవుతుంది. 

ఒక తెలుగువాడిగా పుట్టిన వరవరరావు తన మాతృబాషలోని ఈ మాధుర్యాన్ని, గొప్పదనాన్ని, విలక్షణతను గుర్తించి ఆస్వాదించకపోగా తెలుగువారి పండుగను అగ్రవర్ణ భూస్వామ్య భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఉద్దేశ్యించినవని అనడం శోచనీయం. ఆయన ప్రతీ విషయాన్ని ‘మావోయిస్ట్ కళ్ళద్దాలలో’ నుంచి చూస్తున్నందునే ఈవిధంగా వితండవాదం చేస్తున్నారని చెప్పవచ్చు. తెలుగు బాష, సాహిత్యం, కళలు, సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనం చాటిచెప్పే ఈ మహాసభలకు భౌగోళిక ఎల్లలు లేవని చాటి చెపుతూ దేశవిదేశాలలో ఉంటున్న వేలాదిమంది తెలుగు బాషాభిమానులు తరలిరాబోతున్నారు. తెలుగు బాష గొప్పదనాన్ని మరోమారు చాటి చెప్పబోతున్నారు. కనుక ఇటువంటి వరవరరావులు ఆ మహాసభలను వ్యతిరేకించిన మాత్రాన్న వచ్చే నష్టం ఏమీ లేదు. ఈవిధంగా మాట్లాడి అయన తన సంకుచిత దృక్పధాన్ని స్వయంగా మరోసారి చాటుకొన్నారు. అంతే! 


Related Post