విశాల్ నామినేషన్ రియల్లీ ఓ మిష్టరీ..

December 07, 2017


img

ఇంతవరకు మరెవరికీ ఎదురుకాని చిత్రవిచిత్రమైన రాజకీయ పరిణామాలు తమిళనటుడు విశాల్ కు ఎదురవుతుండటం విశేషం. చెన్నై ఆర్.కె.నగర్ ఉపఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేస్తే దానిలో ఆయనకు మద్దతు ఇచ్చిన వారి సంతకాలలో తేడాలున్నాయని చెపుతూ ఎన్నికల సంఘం అతని నామినేషన్ తిరస్కరించింది. అందుకు విశాల్ ధర్నాకు కూర్చోగానే అతనిని పిలిచి మాట్లాడి నామినేషన్ స్వీకరిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెప్పారు. కాసేపు తరువాత అతని నామినేషన్స్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. 

ఎన్నికల సంఘంపై హైకోర్టులో దావా వేస్తానని విశాల్ ప్రకటించగానే ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్పందించి, విశాల్ నామినేషన్ పేపర్లపై సంతకాలు చేసిన ఇద్దరు వ్యక్తులను రెండు గంటలలో తన ముందు హాజరుపరచాలని సందేశం పంపించారు. విశాల్ వారికి ఫోన్ చేయగా ఆ ఇద్దరి ఫోన్లు స్విచ్చ్ ఆఫ్ చేసి ఉన్నాయి! కనుక వారి ఆచూకి విశాల్ కు తెలియదు. తన నామినేషన్స్ స్వీకరించమని విశాల్ తమను బెదిరిస్తున్నాడని ఎన్నికల సంఘం అధికారులు ఆరోపించారు.

 ఇంతకీ విశాల్ కు మద్దతుగా నామినేషన్ పేపర్లపై సంతకాలు పెట్టిన దీపాన్, సుమతి ఇద్దరినీ ఎవరు మాయం చేశారో తెలియడం లేదు కానీ తన ప్రత్యర్దులే ఎవరో తనను అడ్డుకొని బద్నాం చేయడానికే వారిరువురిని కిడ్నాప్ చేసి ఉంటారని విశాల్ అనుమానిస్తున్నాడు. 

ఈ ఘటనలపై విశాల్ తీవ్రంగా స్పందిస్తూ, “నేను ఈ ఉపఎన్నికలలో పోటీ చేసినా చేయకపోయినా నష్టమేమి లేదు కానీ ఈ ఎన్నికలలో నాకంటే ముందు ప్రజాస్వామ్యం ఓడిపోయిందని ఖచ్చితంగా చెప్పగలను. ఒక స్వతంత్ర అభ్యర్ధిని పోటీ చేయకుండా అడ్డుకోవడానికి ఇంత నీచానికి ఒడిగట్టడం చాలా దారుణం. ఇప్పుడు నా నామినేషన్ స్వీకరణ కంటే, కిడ్నాప్ అయిన నా అనుచరులిద్దరూ క్షేమంగా తిరిగిరావడమే నాకు ముఖ్యం. వారిరువూ ఎక్కడ ఉన్నారో వారి యోగక్షేమాల గురించి చాలా ఆందోళనగా ఉంది. వారి జాడ తెలియకపోతే పోలీసులకు పిర్యాదు చేస్తాను,” అని విశాల్ అన్నాడు. 


Related Post