అయ్యో రైతన్నల్లారా ఎంత కష్టమోచ్చిందే మీకు?

December 07, 2017


img

తెలంగాణా ప్రభుత్వం తెలంగాణా రైతు పక్షపాతి... రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ మొదలు గల్లీ స్థాయి తెరాస నేతల వరకు పదేపదే చెపుతుంటారు. ఇక ‘బంగారి తెలంగాణా’ అనే పదం అందరికీ ఊత పదమైపోయింది. కానీ వాస్తవపరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని రైతుల ఆత్మహత్యలు నిరూపించి చూపుతున్నాయి. 

ఈ 42 నెలలలో రైతులు ఆత్మహత్యలు చేసుకోని నెల లేదంటే అతిశయోక్తి కాదు. నిన్న బుధవారం ఒక్క రోజునే రాష్ట్రంలో ఆరుగురు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకొన్నారు. పంటలు సరిగా పండకపోవడం.. పండినవాటికి గిట్టుబాటు ధరలు లభించకపోవడం..పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేకపోవడం..అప్పులు తీర్చమని ఒత్తిళ్ళు..ఇంచుమించు అందరివి ఒకే రకమైన కష్టాలు. 

మహబూబ్ నగర్ జిల్లాలో బిజ్వార్ లో డోలిమి చంద్రప్ప (47) మంగళవారం రాత్రి తన పొలంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. 

అదిలాబాద్ జిల్లాలో తాంసీ మండలం పొన్నారి గ్రామానికి చెందిన గొండ రితీష్ (26), అదే జిల్లాలో నేరడిగొండ మండలం బుద్ధిగొండ గ్రామానికి చెందిన అననేలా సాయన్న (36) అనే రైతులు బుధవారం తమ పొలంలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొన్నారు.

సిద్ధిపేట జిల్లాలో కొమురుపల్లి మండలం రాం సాగర్ గ్రామానికి చెందిన చింతల నర్సింహులు (50), అదే జిల్లాలో బెజ్జంకి మండలం, గూడెం గ్రామానికి చెందిన రొండ్ల కనకారెడ్డి (55) రైతులు తమ పొలాలలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లెందు మండలంలో దారెల్లి ఏసు (50) అనే రైతు బుదవారం తెల్లవారుజామున తన పొలంలో పురుగుల మందు త్రాగి చనిపోయాడు. 

వికారాబాద్ జిల్లాలో పూడూరు మండలంలోని మేడిపల్లి కలాన్ గ్రామానికి చెందిన చింతకింది నర్సింహులు (44) అనే రైతు బుదవారం పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొన్నాడు.

తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో రైతుల ఆత్మహత్యలను గత ప్రభుత్వాల పద్దులో వ్రాసేసేది. కానీ అది అధికారంలోకి వచ్చి 42 నెలలు గడిచింది. కనుక ఇప్పుడు ఈ ఆత్మహత్యలకు ఎవరిని నిందించాలి? ఎవరు బాధ్యత వహిస్తారు?Related Post