పవన్ భుజంపై బాబు తుపాకి..దేనిపై గురి? వైకాపా.. భాజపా

December 07, 2017


img

ఏపిలో పవన్ కళ్యాణ్ చేస్తున్న హడావుడి, మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే అయన ఏపి సిఎం చంద్రబాబు నాయుడు తరపున వైకాపా, కేంద్రప్రభుత్వంతో యుద్ధం చేయడానికే వచ్చిన్నట్లుంది. మరోవిధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు తన చేతికి మట్టి అంటకుండా పవన్ కళ్యాణ్ భుజంపై తుపాకి పెట్టి ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ఒకేసారి అటు కేంద్రాన్ని, ఇటు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తుంది. అంటే తెదేపా, వైకాపా, భాజపాల మద్య జరుగుతున్న ప్రచన్నయుద్ధంలో పవన్ కళ్యాణ్ చిక్కుకొన్నట్లు కనిపిస్తున్నారు. అయితే తాను భాజపా, వైకాపాలను ఉతికి ఆరేస్తున్నానని అని భ్రమ పడుతున్నారు తప్ప ఆ మూడు ముదురు పార్టీల మద్య నలిగిపోతున్నానని గ్రహించినట్లు లేదు. 

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు వైకాపా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చాలా ఘాటుగా జవాబివ్వడమే కాకుండా, “తెదేపా, భాజపాలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేస్తుంటే, ఇన్నాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చోన్నారా? 2014 ఎన్నికలలో ఆ రెండు పార్టీల తరపున హామీలు ఇచ్చిన మీరు కూడా వాటితో సమానంగా బాధ్యత వహించకపోగా, ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతున్న మా అధినేతను వేలెత్తి చూపిస్తున్నారా?” అని నిలదీశారు.

ఇక భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎంపి కంబంపాటి హరిబాబు ఇద్దరూ కూడా పవన్ కళ్యాణ్ మాట తీరును తప్పు పట్టారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఎంతో ఉదారంగా సహాయసహకారాలు అందిస్తుంటే, పవన్ కళ్యాణ్ అనాలోచితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

చంద్రబాబు నాయుడు ఎక్కడో దక్షిణ కొరియాలో యాత్రలు చేసుకొంటుంటే, ఏ సమస్యపై పూర్తి అవగానలేని, దేనినీ పరిష్కరించే శక్తిలేని పవన్ కళ్యాణ్ జనంలోకి వచ్చి తెలిసీ తెలియకుండా ఏదేదో మాట్లాడేస్తూ అందరినీ శత్రువులుగా మార్చుకొంటున్నారు. ఈవిధంగా తేదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తుండటం వలన పవన్ కళ్యాణ్ చేజేతులా తన విశ్వసనీయతను పోగొట్టుకొంటున్నారని చెప్పవచ్చు.    

ఇక జనసేన లక్ష్యం ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్ప పదవులు, రాజ్యాధికారం సాధించడం కాదని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించడం కూడా రాజకీయ అపరిపక్వతగానే భావించాల్సి ఉంటుంది. ఒక పక్క పార్టీ నిర్మాణం చేసుకొంటూ, 2019 ఎన్నికలలో పోటీ చేస్తామని చెపుతూ పవన్ కళ్యాణ్ ఈవిధంగా మాట్లాడటం అయన అయోమయానికి, అపరిపక్వతకు అద్దం పడుతోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కు నిజంగానే ఎన్నికలలో పోటీచేసి గెలిచి అధికారంలోకి రావాలనే ఆలోచన లేనట్లయితే ఎవరూ జనసేనలో చేరడానికి ఆసక్తిచూపరు. ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ పై అపనమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు వైకాపా ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపిస్తున్నట్లుగా జనసేన పార్టీ కేవలం ప్రజల ఓట్లను చీల్చడానికి మాత్రమే పనికివస్తుందని చెప్పకతప్పదు.  


Related Post