ఆ ఉపఎన్నికలు అంత కీలకమా?

December 07, 2017


img

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిద్యం వహించిన చెన్నైలోని ఆర్.కె.నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల 21న ఉపఎన్నికలు జరుగబోతున్నాయి. ఇదివరకు ఆ నియోజకవర్గానికి ఉపఎన్నికలు నిర్వహించబోతే, బరిలో ఉన్న ప్రధాన పార్టీ అభ్యర్ధులు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో కేంద్ర ఎన్నికల కమీషన్ ఉపఎన్నికలను వాయిదా వేసింది. ఈసారి జరుగబోయే ఉపఎన్నికలలో ఎన్నికల సంఘం రాజకీయ ఒత్తిళ్లకు లొంగి తన నామినేషన్ పత్రాలను తిరస్కరించిందని స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి సిద్దమైన నటుడు విశాల్ ఆరోపిస్తున్నారు.

"ఆర్.కె.నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్ధులు ఎవరూ పోటీ చేయకూడదా? ప్రధానపార్టీలు మాత్రమే పోటీ చేయాలా?" అని విశాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట తన నామినేషన్ పత్రాలను తిరస్కరించిన ఎన్నికల సంఘం తన వాదనలు విన్న తరువాత దానిని స్వీకరిస్తున్నట్లు ప్రకటించిందని, మళ్ళీ కొన్ని గంటల వ్యవధిలోనే దానిని ఎందుకు తిరస్కరించిందని విశాల్ ప్రశ్నిస్తున్నారు.

స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి దిగిన స్వర్గీయ జయలలిత మేనకోడలు దీప నామినేషన్ పాత్రలను కూడా సాంకేతిక లోపాలను చూపి ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఆమె కూడా ఎన్నికల సంఘం తీరును తప్పుపడుతున్నారు. తనను కూడా నామినేషన్ వేయవద్దని కొందరు ఫోన్లో బెదిరించారని అయినా ధైర్యంగా నామినేషన్ వేస్తే, ఎన్నికల సంఘం రాజకీయ ఒత్తిళ్లకు లొంగి కుంటిసాకులు చూపి దానిని తిరస్కరించిందని ఆమె ఆరోపిస్తున్నారు.

ఎన్నికల సంఘం నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టులో సవాలు చేస్తానని విశాల్ హెచ్చరించారు. ఈ ఉపఎన్నికలలో తనకు పోటీచేయకుండా కొన్ని రాజకీయ శక్తులు అడ్డుపడినప్పటికీ, స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వేరే వ్యక్తికి మద్దతుగా ప్రచారం చేసి గెలిపించుకొంటానని విశాల్ ప్రతిజ్ఞ చేశాడు. 

ఆర్.కె.నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలలో రెండవసారి కూడా ఇంత రాజకీయ ఒత్తిళ్ళు నెలకొని ఉండటం చూస్తుంటే, అధికార అన్నాడిఎంకె, ప్రతిపక్ష డిఎంకె పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న శశికళ మేనల్లుడు దినకరన్ ఈ ఉపఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారో అర్ధం అవుతోంది. ఈ ఉపఎన్నికలలో నటుడు విశాల్, జయ మేనకోడలు దీపగానీ పోటీ చేసినట్లయితే, వారు విజయం సాధించలేకపోయినా, తప్పకుండా ఓట్లను చీల్చడం ఖాయం. దాని వలన ముగ్గురు ప్రధాన అభ్యర్ధులకు తీవ్ర నష్టం జరుగుతుంది కనుకనే ఎన్నికల సంఘంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చి తమను పోటీలో నుంచి తప్పించారని వాదనలు వినిపిస్తున్నాయి. 


Related Post