పవన్ అందుకే రంగంలో దిగారా?

December 06, 2017


img

ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ‘ట్రబుల్ మేకర్’ గా నిలుస్తుంటే, జనసేనాని పవన్ కళ్యాణ్ ‘సేవియర్’ పాత్ర పోషిస్తుంటారు. 

రాజధాని అమరావతి కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తూ జగన్ దీక్షలు చేపట్టడానికి సిద్దంకాగానే పవన్ కళ్యాణ్ కూడా వెలగపూడి వెళ్ళి చాలా హడావుడి చేయడం బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ పెద్ద కార్యక్రమం పెట్టుకొన్నా పవన్ కళ్యాణ్ కూడా వెంటనే రంగంలో దిగిపోతుంటారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. 

ఏపి ప్రజలను ఆకర్షించి వచ్చే ఎన్నికలలో విజయం సాధించడం కోసం జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ తన పాదయాత్రలో చంద్రబాబు నాయుడునే లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తూ ముందుకు సాగిపోతున్నారు. వాటికి తగ్గట్లుగానే పోలవరానికి బ్రేకులు పడటం, రాజధాని నిర్మాణం ఇంకా కాగితాలకే పరిమితం కావడం, ప్రత్యేకహోదా, విజయవాడ, విశాఖ మెట్రో రైల్ సర్వీసులు, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు వంటివన్నీ మాటలకే పరిమితం కావడంతో జగన్ విమర్శలతో ఏపి సర్కార్ చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. 

బహుశః అందుకేనేమో చంద్రబాబు మళ్ళీ పవన్ కళ్యాణ్ ను రంగంలో దింపి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ పాదయాత్రకు సమాంతరంగా పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తే ప్రజల దృష్టి జగన్ పై నుంచి పవన్ కళ్యాణ్ మీదకు మళ్ళడం సహజమే. పైగా పవన్ కళ్యాణ్ చేతే జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పింపజేస్తే, అప్పుడు జగన్ ఏకరువు పెడుతున్న సమస్యలపై నుంచి ప్రజల దృష్టి పవన్ చేస్తున్న విమర్శలపైకి మళ్ళవచ్చు. కనుక పవన్ కళ్యాణ్ ఏదో యాదృచ్చికంగా ఉత్తరాంద్ర జిల్లాలో పర్యటిస్తున్నారనుకోలేము.

పవన్ కళ్యాణ్ ఇవ్వాళ్ళ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, “ప్రజలకు సేవ చేయాలంటే పదవులు, అధికారం అవసరం లేదు. అవి లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాడి ప్రభుత్వం చేత పరిష్కరింపజేయవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను ముఖ్యమంత్రి అయితేనే ప్రజల సమస్యలను తీర్చగలనని చెపుతున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలంటే చాలా పరిపాలనానుభావం ఉండాలి. మరి జగన్మోహన్ రెడ్డి కి ఏముందని ముఖ్యమంత్రి అయిపోవాలనుకొంటున్నారు?” అని ప్రశ్నించారు. 

ప్రజా సమస్యలపై జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే ఘాటుగా స్పందించే ఏపి సర్కార్, అదే..పవన్ కళ్యాణ్ నిలదీస్తే చాలా అణకువగా, సానుకూలంగా స్పందిస్తుంటుంది. పవన్ కళ్యాణ్ ఇంకా సమస్యలపై ప్రశ్నించక మునుపే ఏపి మానవవనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ ఎటువంటి సమస్యలను మా దృష్టికి తెచ్చినా వాటిని తప్పకుండా పరిష్కరిస్తాము,” అని చెప్పడం గమనిస్తే పవన్ కళ్యాణ్ తెదేపా సర్కార్ ను జగన్మోహన్ రెడ్డి దాడుల నుంచి రక్షించడానికే హటాత్తుగా రంగంలోకి దిగినట్లు అనుమానం కలుగుతోంది. 


Related Post