స్మార్ట్ బైక్స్ మెట్రోకు గుదిబండగా మారబోతున్నాయా?

December 06, 2017


img

హైదరాబాద్ జంట నగరాలలో మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్ బైక్స్ (అద్దె సైకిళ్ళు)కు ప్రజల నుంచి ఆధరణ లభిస్తోందా? అంటే అనుమానమే. వాటికి వసూలు చేస్తున్న అద్దె చాలా ఎక్కువగా ఉండటం మొదటి కారణం కాగా, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండే జంట నగరాలలో సైకిల్ సవారీకి అనుకూలంగా లేకపోవడం, సైకిల్ సవారీ చేసే ఆసక్తి, ఓపిక, సమయం ప్రజలకు లేకపోవడం వంటి అనేకానేక కారణాల చేత వాటికి అంతగా ఆదరణ లభించడం లేదని చెప్పవచ్చు. పైగా తగినంత పైకం చెల్లించి ముందుగా రీ- ఛార్జ్ చేసుకోకపోతే అవి దారి మద్యలోనే ఆటోమేటిక్ గా నిలిచిపోతాయని వాటి నిర్వాహకులే చెపుతున్నారు. ఒకవేళ దారిలో ఏదైనా ప్రమాదం జరిగి ఖరీదైన ఆ స్మార్ట్ బైక్ దెబ్బ తిన్నట్లయితే, దానికి వినియోగదారుడే మూల్యం చెల్లించక తప్పదని వేరే చెప్పనవసరం లేదు. కనుక ప్రజలు ఈ స్మార్ట్ బైక్స్ వాడేందుకు ఇష్టపడటం లేదని చెప్పవచ్చు.

ఈ స్మార్ట్ బైక్స్ ఉపయోగించుకోవడానికి మొదటి అర్ధగంట సమయానికి రూ.10 అద్దె చెల్లించవలసి ఉంటుంది. ఆ తరువాత 30-60 నిమిషాలకు (సభ్యత్వం తీసుకొన్నవారికి రూ.10) ఇతరులు  రూ.25 చెల్లించాలి. ఆ తరువాత ప్రతీ అర్ధగంట సమయానికి (సభ్యులకు రూ.15) ఇతరులు రూ.25 చొప్పున చెల్లించవలసి ఉంటుంది. అదే వారానికైతే రూ.150, నెలకైతే రూ.375 చెల్లించవలసి ఉంటుంది. మెట్రో స్టేషన్ బయటకు రాగానే అనేక ఆటోలు, బస్సులు తిరుగుతున్నప్పుడు, ఇంత డబ్బులు కట్టి ఎవరు మాత్రం కష్టపడి సైకిల్ సవారీ చేయాలనుకొంటారు? వాటికి బదులు మంచి మైలేజి ఇచ్చే మోటార్ బైక్స్, స్కూటీలను, నానో కార్లను ఏర్పాటు చేసి ఉండి ఉంటే అందరూ వాటిని తప్పకుండా వినియోగించుకొని ఉండేవారు. కనుక ఈ స్మార్ట్ బైక్స్ హైదరాబాద్ మెట్రో సంస్థకు ఏదో ఒకరోజు గుదిబండగానే మారే అవకాశాలు  కనిపిస్తున్నాయి. 


Related Post