ఉస్మానియా పిజి విద్యార్ధి ఆత్మహత్య

December 04, 2017


img

ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ (నానో సైన్స్) ఫస్ట్ ఇయర్ విద్యార్ధి మురళి ఆదివారం ఉదయం హాస్టల్ స్నానాల గదిలో ఉరేసుకొని చనిపోయాడు. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొంటున్నట్లు సూసైడ్ నోట్ లో వ్రాశాడు. మురళి ఆత్మహత్య చేసుకోవడంతో యూనివర్సిటీలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మురళి శవాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించడానికి వచ్చిన పోలీసులను విద్యార్ధులు అడ్డుకొన్నారు. ఎట్టకేలకు వారిని ఒప్పించి రాత్రి 10.30 గంటలకు శవాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. మురళి ఆత్మహత్యకు ప్రభుత్వం, యూనివర్సిటీ వైస్ చాన్సలర్ బాధ్యత వహించాలని, ప్రభుత్వం అతని కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు  విద్యార్ధులు యూనివర్సిటీ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సంగతి తెలుసుకొన్న టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తదితరులు ఆదివారం రాత్రి యూనివర్సిటీకి వచ్చి విద్యార్ధులతో మాట్లాడారు. యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా బారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. 

మురళి స్వస్థలం సిద్దిపేట జిల్లాలో జగదేవ్ పూర్ మండలం దౌలాపూర్. మురళి చిన్నప్పుడు తండ్రి ఈరమైన మల్లేశం చనిపోయారు. అప్పటి నుంచి తల్లి లక్ష్మి వ్యవసాయకూలి పనులు చేసుకొంటూ తన ఇద్దరు కుమారులు, కుమార్తెను పెంచి పోషించి చదివిస్తోంది. చదువులలో రాణిస్తున్న మురళిపై ఆ తల్లి చాలా ఆశలు పెట్టుకొంది. మురళి కూడా మంచి చదువులు చదువుకొని ఉద్యోగం సంపాదించి తల్లిని, తమ్ముళ్ళు, చెల్లెలను బాగా చూసుకోవాలనుకొన్నాడు. గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసిన తరువాత ఈ ఏడాదే ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజీలో సీట్ సంపాదించుకొని మానేరు హాస్టల్ లో ఉంటూ చదువుకొంటున్నాడు. చడువుల ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకొన్నట్లు లేఖలో వ్రాసినప్పటికీ, కుటుంబ ఆర్ధిక సమస్యలు, భవిష్యత్ పట్ల తీవ్ర ఆందోళన కారణంగానే ఆత్మహత్య చేసుకొన్నట్లు భావించవచ్చు. 

అంత పేద కుటుంబం నుంచి వచ్చిన మురళి అటువంటి ఉన్నత విద్యలు అభ్యసిస్తున్నాడంటే ఖచ్చితంగా అతను చాలా మంది విద్యార్ధుల కంటే చాలా తెలివైనవాడేనని అర్ధం అవుతోంది. కనుక చదువుల ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకొన్నాడంటే నమ్మశక్యంగా లేదు. కనుక ఇంత కష్టపడి చదివినా తనకు ఉద్యోగం దొరుకుతుందా లేదా? దొరకకపోతే తన కుటుంబం పరిస్థితి ఏమిటి? అనే ఆందోళనతోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో ఊగిసలాడుతున్న విద్యార్ధులకు, నిరుద్యోగులకు ప్రభుత్వం, ప్రతిపక్షాలు, టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వంటి నేతలు భరోసా కల్పించకపోగా వారి వాదోపవాదాలతో నిరుద్యోగులలో ఇంకా అయోమయం, తీవ్ర ఆందోళన, అభద్రతా భావం కల్పిస్తున్నాయి. బహుశః అందుకే మురళి నిరాశా నిస్పృహలకు లోనై ఆత్మహత్య చేసుకొన్నాడని చెప్పవచ్చు. ఇప్పుడు మురళి ఆత్మహత్యపై కూడా అధికార ప్రతిపక్షాలు రాజకీయాలు చేయకుండా, విద్యార్ధులకు, నిరుద్యోగులకు భవిష్యత్ పై భరోసా కలిగేవిధంగా మాట్లాడి, అందుకు అనుగుణంగా చర్యలు చేపడితే బాగుంటుంది. ముఖ్యంగా టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్, చుక్కా రామయ్య, గద్దర్ వంటి మేధావులు ప్రభుత్వోద్యోగాలు దొరకకపోతే నిరుద్యోగుల భవిష్యత్ శూన్యం అనే భావన వ్యాపింపజేయకుండా, వారి ఉజ్వల భవిష్యత్ కు ఉన్న ప్రత్యామ్నాయాల గురించి వివరించగలిగితే ఇటువంటి విషాదకర సంఘటనలు నివారించవచ్చు. ప్రభుత్వం కూడా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయడం చాలా అవసరం. 



Related Post