కోదండరాం కొట్లాట తన కొలువు కోసమేనా?

December 04, 2017


img

ఇవ్వాళ్ళ సరూర్ నగర్ స్టేడియంలో టిజేఎసి అధ్వర్యంలో ‘కొలువుల కొట్లాట’ భహిరంగ సభ జరుగబోతోంది. తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చి 42 నెలలు గడుస్తున్నప్పటికీ ఉద్యోగాల భర్తీ చేయకుండా ఉద్దేశ్యపూర్వకంగానే జాప్యం చేస్తొందని టిజేఏఎసి ఆరోపణ. కనుక ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నేడు ఈ సభ నిర్వహిస్తున్నామని టిజెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చెపుతున్నారు.  

కానీ అయన చేస్తున్న ‘కొలువుల కొట్లాట’ తన కొలువు కోసమేనని తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం 1.12 లక్షల ఉద్యోగాల భర్తీ చేయడానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా శాసనసభలో ప్రకటించారని రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. ఉద్యోగాల భర్తీ విషయంలో తమ ప్రభుత్వం ఏమాత్రం అలసత్వం ప్రదర్శించడం లేదని, ఇప్పటి వరకు 27,000 ఉద్యోగాలు భర్తీ చేశామని మరో 63,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశలలో ఉందని తెలిపారు. 

నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీతో ప్రొఫెసర్ కోదండరాం చేతులు కలపడం విడ్డూరంగా ఉందని అన్నారు. ‘ఆయనొక రాజకీయ నిరుద్యోగి..అందుకే ‘తన కొలువు’ కోసం కొట్లాకు సిద్దం అవుతున్నారని’ పల్లా విమర్శించారు. ఉద్యోగాల ఖాళీలు, భర్తీ గురించి అసత్యాలు చెపుతూ యువతను రెచ్చ తప్పు ద్రోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని పల్లా ఆరోపించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన భాజపాను నిలదీయకుండా దానితోనే కోదండరాం ఎందుకు చేతులు కలుపుతున్నారని పల్లా ప్రశ్నించారు. ప్రొఫెసర్ కోదండరాం రాజకీయ దురుదేశ్యంతోనే ప్రతిపక్షాలతో చేతులు కలిపి తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. 

ప్రొఫెసర్ కోదండరాం తన కొలువు కోసమే కొట్లాటకు దిగుతున్నారనే పల్లా వాదన సహేతుకంగా లేదు. ఎందుకంటే, ఒకవేళ ఆయనకు నిజంగా పదవులు, అధికారం కావాలనుకొంటే 2014 ఎన్నికలలో తెరాస టికెట్ ఆఫర్ చేసినప్పుడు ఎగిరి గంతేసి తీసుకొని దానిని ఉండేవారు. ఆయన అప్పుడే ఎన్నికలలో పోటీ చేసి ఉండి ఉంటే బారీ మెజార్టీతో గెలిచి ఉండేవారు. కానీ అయన టికెట్ తిరస్కరించి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకొన్న సంగతి అందరికీ తెలుసు. 

ఒకవేళ ఇప్పుడు పదవులు, అధికారంపై ఆయన మోజు పెంచుకొని ఉంటే, టిజెఏసిని రాజకీయ పార్టీగా మార్చడానికి ఇంతగా వెనకాడే వారు కారు. లేదా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి ఉండేవారు కదా? కానీ అయన  నేటికీ రాజకీయాలకు దూరంగా ఉండాలనే కోరుకొంటున్న సంగతి అందరికీ తెలుసు. కనుక ఆయన రాజకీయ దురుదేశ్యంతో తెరాస సర్కార్ తో పోరాడుతున్నారని భావించలేము. 

ఇక ఉద్యోగాల భర్తీ విషయంలో తెరాస సర్కార్ మాట తప్పిన సంగతి అందరికీ తెలుసు. తెలంగాణా ఏర్పడితే 1.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పిన తెరాస, తెలంగాణా ఏర్పడి దాదాపు 42 నెలలు అవుతున్నా ఇంతవరకు కేవలం 27,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశామని స్వయంగా అంగీకరిస్తోంది. మరో 63,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశలలో ఉన్న మాట వాస్తవమే కావచ్చు. ఉద్యోగాల భర్తీ విషయంలో తెరాస సర్కార్ కు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈపాటికే అవి కూడా భర్తీ చేసి ఉండేది. కనుక 63,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, మిగిలిన 22 వేల ఉద్యోగాలను ఇంకా భర్తీ ఎప్పటికి చేస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి. 

కనీసం శాఖల వారిగా ఖాళీల సంఖ్య ప్రకటించి వాటి భర్తీకి క్యాలెండర్ విడుదల చేయమని ప్రొఫెసర్ కోదండరాం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించలేదు. కనుక కొలువుల విషయంలో ప్రొఫెసర్ కోదండరాం కొట్లాటకు దిగక తప్పడం లేదు. కనుక తెరాస నేతలు ఆయనను నిందించడం సరికాదని చెప్పవచ్చు.


Related Post