ఒక తెలంగాణా నిరుద్యోగి ఆవేదన

December 02, 2017


img

టి.ఆర్.టి. పోస్టుల భర్తీకి అర్హత విషయంలో తెలంగాణా ప్రభుత్వం విధించిన నిబందన కారణంగా  అశోక్ జోగుపర్తి అనే ఒక నిరుద్యోగి ఆ పరీక్షలకు అనర్హుడయ్యాడు. తాను ఎంతో కష్టపడి చదివి సంపాదించుకొన్న బీఈడి సర్టిఫికేట్ తనకు ఉపయోగపడకుండా చేసిందనే ఆవేదనతో దానిని ఫేస్ బుక్ లో అమ్మకానికి పెట్టాడు. ఎవరైనా దానిని కొంటే వచ్చే డబ్బును ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తానని చెప్పాడు. ఆ నిరుద్యోగి ఆవేదన మీరే చూడండి.  

ఇది నా బీఈడీ సర్టిఫికేట్.. అమ్ముతాను..ఎవరైనా కావాలంటే చెప్పండి ఇస్తా.. మీరిచ్చిన డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇస్తా... దీనితో తెలంగాణ ప్రభుత్వం నాకు ఏమి ఉపయోగం లేకుండా చేసింది.. మా అమ్మ నన్ను ఎంతో కష్టపడి చదివించింది. నేను బీఈడీ చదివే రోజుల్లో నాకు ఫీజు రీయింబర్స్ కూడా రాలేదు. మంచి ర్యాంక్ తో సొంత డబ్బులతో ఫీజు కట్టి చదువుకున్నా. పంతులు ఉద్యోగం కొలువు చేద్దామని బీఈడీ పూర్తి చేశా. ఇక పంతులు కొలువు ఎప్పుడెప్పుడు సాధిద్దామా అని ఎదురుచూశా. అప్పుడు టెట్ అని ఇంకో మెలిక పెట్టిర్రు. దాంట్లో 60%మార్కులు రావలంట. సరే అదికూడా చదివిన 72% మార్కులు తెచ్చుకున్న. 2012 డీఎస్సీ రాసిన 72 మార్కులు వచ్చినాయి. ఉద్యోగం రాలే. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో డీఎస్‌సీ నోటిఫికేషన్‌కు సిద్ధపడింది.

అయితే దాన్ని వ్యతిరేకిస్తూ మా తెలంగాణలో మా నోటిఫికేషన్‌ మేమే వేసుకుంటం అని ఉద్యమంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నం. ఎప్పుడెప్పుడు డీఎస్‌సీ నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురు చూసినం. మూడేళ్లకు కానీ మన ప్రభుత్వానికి నిరుద్యోగులు గుర్తు రాలేదు. సరే ఇప్పుడు వచ్చింది. మన ప్రభుత్వంలో పంతులు కొలువుకోసం చదువుతున్న. కానీ మన ప్రభుత్వం డిగ్రీలో 50% మార్కులు ఉంటేనే పరీక్ష రాయాలని మెలిక పెట్టింది. నేనెప్పుడో 2008 లో డిగ్రీ పూర్తి చేసిన. నాకు 48.25% మార్కులు వచ్చాయి. అప్పుడే బీఈడీకి అర్హత లేదంటే వేరేది చదువుకునే వాడిని. బీఈడీ చేసి 2 సార్లు టెట్ రాసి, ఒకసారి డీఎస్‌సీ రాస్తే... ఇప్పుడు నేను అర్హుడిని కాదంట.. ఇదెంత వరకు న్యాయమో మీరే చెప్పండి.

36% మార్కులు వచ్చిన వారు కలెక్టర్ అవ్వచ్చు. గ్రూప్ 1 & 2 ఉద్యోగులు అవ్వొచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన నాకు అర్హత లేదంటారా. మరి పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్‌సీలో అందరికీ అవకాశం ఇచ్చింది. నాకు పీజీలో 75% మార్కులు వచ్చాయి. నేను అర్హుడుని కాదా. కనీసం ప్రైవేట్ టీచర్గా కూడా పనికిరానని మన ప్రభుత్వం సర్టిఫై చేసింది నన్ను. అలాంటప్పుడు ఎందుకు నాకీ మెమో. ప్లీజ్ ఎవరైనా కొనండి నా మెమో. నా మీద జాలితో అయిన. ఆ డబ్బు కచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తా. నేను ఇప్పటికీ రెండు పీజీలు చేశా... ఆ మెమోలు కావాలన్నా ఇస్తా. ఎవ్వరూ కొనకపోతే ప్రొఫెసర కోదండరాం సమక్షంలో యూనివర్సిటీ వారికి రిటర్న్ చేస్తా. నేను ఎవ్వరి మీద కోపంతో ఈ మాటలు చెప్పట్లేదు.. ఒక నిరుద్యోగిగా...నా బాధ చెప్పుకున్నా... అని అశోక్‌ జోగుపర్తి ఫేస్ బుక్ లో తన ఆవేదన వ్యక్తం చేశాడు. 



Related Post