రేవంత్ రెడ్డికి మంత్రి మహేందర్ రెడ్డి సవాలు

December 02, 2017


img

ఇటీవల టిటిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆయన ఆ లేఖను స్పీకర్ కు ఇవ్వకుండా పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలోపెట్టి వెళ్ళారు. నేటికీ అది ఆయన వద్దే ఉండిపోవడంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినా తెదేపా ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. 

ఆయన తరచూ ముఖ్యమంత్రి కెసిఆర్ పై విమర్శలు చేస్తూ సవాళ్ళు విసురుతుంటారు కనుక ఆయనకు మంత్రి మహేందర్ రెడ్డి సవాలు విసిరారు. వికారాబాద్ జిల్లాలో దౌల్తాబాద్ మండలంలో నిన్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ పై అయన నిత్యం లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కొడంగల్ ఉపఎన్నికలలో మా పార్టీని ఎదుర్కొని గెలవాలి. ఆయనకు ఉపఎన్నికలలో గెలుస్తాననే నమ్మకం, ధైర్యం రెండూ లేవు కనుకనే ఇంతవరకు తన రాజీనామాను ఆమోదింపజేసుకోవడం లేదు. ఒకవేళ ఉపఎన్నికలు వస్తే, తెరాస చేతిలో ఆయనకు ఓటమి తప్పదు,” అని సవాల్ విసిరారు. 

 గతంలో ఒక పార్టీలో ఎమ్మెల్యేలు వేరొక పార్టీలో చేరేటప్పుడు తప్పనిసరిగా తమ పదవులకు రాజీనామాలు చేసేవారు. కానీ పార్టీలు మారి ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా ఇప్పుడు ఎవరూ తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడం లేదు. ఈ దుసంప్రదాయాన్ని తెరాసయే ప్రారంభించింది. నేటికీ తెరాసలో కాంగ్రెస్, వైకాపా, తెదేపాల ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి చేత రాజీనామాలు చేయించమని లేదా వారిపై అనర్హత వేటు వేయమని ప్రతిపక్షాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ముఖ్యమంత్రి కెసిఆర్ కానీ స్పీకర్ గానీ పట్టించుకోవడం లేదు. అటువంటప్పుడు తెదేపా నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమని అడిగే నైతిక హక్కు తెరాసకు ఉండదు. అసలు ఇది తెదేపా-కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన వ్యవహారమే తప్ప దీనితో తెరాసకు సంబంధమే లేదు. కనుక తెరాసకు సంబందం లేని ఈ వ్యవహారం గురించి దానికి మాట్లాడే హక్కు కూడా ఉండదు. 

ఒకవేళ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటే, ముందుగా తెరాసలో ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎంపి చేత కూడా రాజీనామా చేయించి అప్పుడు ఇటువంటి సవాళ్ళు విసిరితే హుందాగా ఉంటుంది. తెరాస పాటించని నైతిక విలువలను, దానికి వర్తించని నియమనిబంధనలను ఇతర పార్టీలు పాటించాలని కోరడం, ఈవిధంగా సవాళ్ళు విసరడం హాస్యాస్పదం. 

మంత్రి మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఎటువంటి సవాలు విసిరారో, ప్రతిపక్షాలు కూడా తెరాసకు అటువంటి సవాలునే విసురుతున్నాయనే సంగతి అందరికీ తెలుసు. వాటి సవాలును తెరాస ధైర్యంగా స్వీకరించలేనప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయన సవాలును స్వీకరించవలసిన అవసరమే లేదు. 


Related Post