మానవత్వం మంట గలిసిన వేళ..

December 01, 2017


img

వరంగల్ అర్భన్ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్ళపల్లి గ్రామంలో జరిగిన దారుణం చూస్తే కసాయికైనా ఒళ్ళు జలదరించకమానదు. మాధురి అనే 30 ఏళ్ళ వివాహిత యువతిని గ్రామంలోని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా చెట్ల పొదలలోకి తీసుకువెళ్ళి, ఆమె కాళ్ళు చేతులు కట్టివేసి మొహం మీద యాసిడ్ పోశారు. అనంతరం బాధతో విలవిలలాడుతున్న ఆమెను స్క్రూ డ్రైవర్ తో ఆమె కంటిని పొడిచి పారిపోయారు. ఆ స్థితిలో ఉన్న ఆమెను కొందరు గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు, ఆమెను హుటాహుటిన వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కానీ యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన మాధురి గురువారం రాత్రి మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈ కిరాతకానికి పాల్పడిన దుండగుల కోసం గాలిస్తున్నారు.  

సుమారు మూడేళ్ళ క్రితం మాధురికి ఆమె బావతో వివాహం జరిగింది. కానీ వారి మద్య మనస్పర్ధలు తలెత్తడంతో ఆమె తల్లి వద్దకు వచ్చేసి నల్లగొండలో ఒక పెట్రోల్ బంకులో పనిచేసుకొంటూ జీవిస్తోంది. ఆ సమయంలో ఆమెకు శాఖరాశికుంట ప్రాంతానికి చెందిన చందు అనే ఒక ఆటో డ్రైవర్ పరిచయం అయ్యాడు. కొద్దిపాటి పరిచయంతోనే అతడు పెళ్లి చేసుకొందామని మాధురిని వేదించసాగాడు. వారి వ్యవహారాన్ని గమనించిన పెట్రోల్ బ్యాంకు యాజమాన్యం ఆమెకు సహాయపడకపోగా ఆమెను పనిలో నుంచి తొలగించింది. దాంతో ఆమె మళ్ళీ ఉద్యోగప్రయత్నాలలో గర్మిళ్ళపల్లి నుంచి వరంగల్ పట్టణానికి తిరుగుతోంది. రెండు రోజుల క్రితం ఆమె అదేపని మీద ఇంటి నుంచి వరంగల్ వెళుతుంటే మార్గమధ్యంలో ఆమెను గుర్తు తెలియని కొందరు బంధించి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆటో డ్రైవర్ చందూ, అతని అనుచరులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తున్న  పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. 

ఈ దారుణ ఘటన ఒక నిసహా మహిళకు మన సమాజంలో ఏపాటి భద్రత ఉందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించేవారిని కటినంగా శిక్షించినప్పుడే ఇటువంటి నేరాలు చేయాలంటే నేరస్తులకు భయం ఉంటుంది. కానీ రెండేళ్ళ క్రితం డిల్లీలో నిర్భయ ఘటనలో దోషులుగా తెలినవారికి నేటికీ శిక్షలు అమలుకాకపోవడం గమనిస్తే అటువంటి నేరస్తులను శిక్షించడంలో మన చట్టాలు, న్యాయస్థానాలు ఏవిధంగా విఫలం అవుతున్నాయో కనిపిస్తోంది. అందుకే ఇటువంటి నేరాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి.  


Related Post