కేంద్రం షాక్..బాబు విలవిల!

November 30, 2017


img

భాజపాకు మిత్రపక్షం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వామిగా ఉన్న తెదేపాకు కేంద్రం షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు టెండర్లను నిలిపివేయమని కోరుతూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వ్రాసింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం కాంగ్రెస్ హయంలో మొదలైన ఆ ప్రాజెక్టు ఎంపి రాయపాటి సాంభశివరావు వంటి కాంట్రాక్టర్లను పోషించడానికి తప్ప దాని వలన రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఇటీవల అయనకు చెందిన ట్రాన్స్ టాయ్ సంస్థను కాంట్రాక్టు నుంచి తప్పించడానికి డిల్లీలో చర్చలు జరిగాయి. కానీ ఆ సంస్థనే కొనసాగించాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాతే కేంద్రం నుంచి ఈ లేఖ వచ్చింది కనుక పోలవరం పనులు జరుగుతున్న తీరుపట్ల కేంద్రం అసంతృప్తిగా ఉన్నట్లు సందేహించవలసి వస్తోంది. అ ప్రాజెక్టులో చాలా అవకతవకలు జరుగుతున్నాయని భాజపా నేత పురందేశ్వరి చాలాసార్లు విమర్శించినా ఏపి సర్కార్ వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించడంతో ఇంతకాలంగా ఆమె కేంద్రం అభిప్రాయాలనే వ్యక్తం చేస్తున్నారనే భావన కలుగుతోంది. 

దీనిపై ఏపి సిఎం చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగానే స్పందించారు. “పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నేను అహర్నిశలు కష్టపడుతున్నాను. ఇదే ఊపులో పనిచేస్తేనే పోలవరం పూర్తవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఒక ఆరు నెలలు పనులు నిలిపేసినట్లయితే, ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగిపోతుంది. అప్పుడు ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఒకవేళ ఈ ప్రాజెక్టును కేంద్రమే స్వయంగా నిర్మిస్తానంటే దానికి అప్పజెప్పేసి ఒక దణ్ణం పెడతాను. ఎవరు పనులు చేశారనేది కాదు ముఖ్యం. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడమే నాకు ముఖ్యం. అసలు పోలవరం ప్రాజెక్టుకు ఇన్ని ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయో నాకు అర్ధం కావడం లేదు. మిత్రపక్షంగా ఉన్నాము కనుక చాలా సహనంగా వ్యవహరిస్తున్నాను. ఒకవేళ కేంద్రం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి తగినన్ని నిధులు, అనుమతులు మంజూరు చేయకపోతే చివరికి మా కష్టమే మిగులుతుంది. రాష్ట్ర విభజన సమయంలో ఆ తరువాత మాకు కేంద్రం అనేక హామీలు ఇచ్చింది. వాటిని అమలుచేస్తే చాలు. నేను ఒక ఆశావాదిని. ఎవరు ఏవిధంగా వ్యవహరించినా చివరి నిమిషం వరకు నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉంటాను. ఈ సమస్య గురించి కేంద్రమంత్రి నితిన్ గడ్కారీతో మాట్లాడేందుకు ప్రయత్నించాను. అయన విదేశీయాత్రలో ఉన్నారు. త్వరలోనే డిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీతో దీని గురించి మాట్లాడాలనుకొంటున్నాను,” అని అన్నారు.

రాజధాని నిర్మాణం మొదలయ్యే అవకాశాలు కనబడకపోవడంతో చంద్రబాబు పోలవరాన్ని భుజానికెత్తుకొని శరవేగంగా పనులు చేయిస్తున్నారు. కనీసం దానిలో పెద్ద పనులను పూర్తిచేసి ప్రజలకు చూపించి, వచ్చే ఎన్నికలలో ఓట్లు అడగాలనుకొన్నారు. కానీ ఇప్పుడు దానికీ ఆటంకం ఏర్పడటంతో చంద్రబాబుకు ఆగ్రహం అసంతృప్తి కలగడం సహజమే. పైగా పోలవరం మరో నాలుగైదేళ్ళలోగా పూర్తి కాదని తెదేపా ఎంపి జేసి దివాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెపుతుంటే, పోలవరంలో బారీగా అవినీతి తప్ప మరేమీ జరగడం లేదని వైకాపా నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు కేంద్రమే పనులు నిలిపివేయమని చెప్పడంతో వైకాపా నేతలు చెలరేగిపోవడం ఖాయం. అది తెదేపా, భాజపాలు రెంటికీ ఇబ్బందికరంగా మారవచ్చు. కనుక ఈ సమస్యపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే పరువాలేదు లేకుంటే తెదేపా, భాజపాల స్నేహంపై  ప్రభావం చూపే అవకాశం ఉంది.                



Related Post