పులిహోరలో కరివేపాకులాంటివాళ్ళం: జేసి

November 30, 2017


img

సంచలన వ్యాఖ్యలు చేసే తెదేపా ఎంపి జేసి దివాకర్ రెడ్డి ఈరోజు మళ్ళీ నోటికీ పని చెప్పారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రం ఎంపిలను పులిహోరలో కరివేపాకులాగ తీసి పక్కన పడేసింది. డిల్లీలో మమ్మల్ని పట్టించుకొనేవారుండరు. పార్లమెంటులో మేము ఉత్సవ విగ్రహాలలాగ కూర్చోవడం తప్ప మాట్లాడేందుకు మాకు అవకాశం, హక్కు రెండూ ఉండవు. వచ్చే ఎన్నికలలో ఇక నేను పోటీ చేయను. మా అబ్బాయి లోక్ సభకు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. చంద్రబాబు కరుణిస్తే వచ్చే ఎన్నికలలో మా అబ్బాయే అనంతపురం నుంచి ఎంపిగా పోటీ చేస్తాడు,” అని అన్నారు.

ఎంపిలు కరివేపాకులాంటి వాళ్ళని, డిల్లీలో వారిని పట్టించుకొనేనాధుడు లేడని చెపుతూనే మళ్ళీ వెంటనే ‘మా అబ్బాయి ఎంపిగా పోటీ చేయాలనుకొంటున్నాడు. బాబు కరుణించాలి,” అనడం జేసీకె చెల్లునేమో? 

తెరాస ఎంపిలు పార్లమెంటు సమావేశాలలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను గట్టిగా ప్రస్తావిస్తుంటారు. అలాగే జి.ఎస్.టి.వంటి కీలకమైన అంశాలపై జరిగిన చర్చలలో కూడా చురుకుగా పాల్గొంటుంటారు. డిల్లీలో కేంద్రమంత్రులను కలుస్తూ, రాష్ట్రానికి రావలసినవాటిని సాధించుకొనేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తుంటారు. తెరాస ఎంపిలు డిల్లీలో ఇంతగా పనిచేయగలుగుతున్నప్పుడు, తమను కేంద్రం కరివేపాకులా తీసి పడేస్తోందని జేసి చెప్పడం, తన బాధ్యతల నుంచి తప్పించుకోవడంగానే భావించవలసి ఉంటుంది. 

తెరాస ఎంపిలు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో గట్టిగా పోరాడుతుంటే, ఆంధ్రా ఎంపిలు తమ వ్యాపార లావాదేవీల కోసం డిల్లీలో పైరవీలు చేసుకొంటూ కాలక్షేపం చేస్తుంటారని ఇదివరకు పవన్ కళ్యాణ్ విమర్శించారు. వారికి తమ బాధ్యతలు, రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ వ్యక్తిగత, రాజకీయ, వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమని పవన్ కళ్యాణ్ విమర్శించినప్పుడు కేశినేని ట్రావెల్స్ అధినేత తెదేపా ఎంపి కేశినేని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఆనాడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని జేసి మాటలు నిరూపిస్తున్నాయి. 

ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ గురించి కూడా జేసి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “పవన్ కళ్యాణ్ కు అయన సోదరుడు చిరంజీవే పెద్ద శాపం. అయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి దానిని కొనసాగించకుండా మద్యలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం వంటి పొరపాట్లు చేశారు. విత్తనాలు చల్లగానే సరిపోదు. పంట కూడా పండించాలి కదా? 

చిరంజీవి వైఫల్యం అతని తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై ప్రభావం చూపుతోందని జేసి అభిప్రాయంగా భావించవచ్చు. అది కొంతవరకు నిజమే కానీ, ఆ అన్నదమ్ములిద్దరి ఆలోచనలు, వ్యవహార శైలి పూర్తి భిన్నమైనవి. కనుక ప్రజలు పవన్ కళ్యాణ్ ను యధాతధంగానే చూస్తారు తప్ప అన్నతో ముడిపెట్టి చూడకపోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఏదో ఒకరోజు అన్నలాగే జనసేన పార్టీని నడపలేక చేతులు ఎత్తేయవచ్చనే అనుమానాలు మాత్రం ప్రజలలో ఉన్నాయని చెప్పక తప్పదు.  


Related Post