రజనీ, కమల్ దొందూ దొందేనా?

November 30, 2017


img

రజనీకాంత్, కమల్ హాసన్ ల గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇద్దరూ సినీ పరిశ్రమలో నెంబర్: 1 స్థానంలో ఉన్నారు. లక్షలాది మంది అభిమానులు కలిగి ఉన్నారు. వారు చేసే సినిమాలలో ఎటువంటి క్లిష్టమైన సమస్యలనైనా చిరునవ్వులు చిందిస్తూ అలోకగా చేసిపడేస్తుంటారు. కానీ ఇద్దరూ నిజజీవితంలో మాత్రం మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కు అన్నట్లు వ్యవహరిస్తుంటారు. 

ఇద్దరికీ రాజకీయాలలో ప్రవేశించాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ ధైర్యంగా అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. రజనీకాంత్ సుమారు రెండు దశాబ్దాలుగా ‘దేవుడి ఆదేశం కోసం’ ఆకాశంవైపు చూ(పి)స్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు తన రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడేందుకు కూడా రజనీ జంకుతున్నారు. ఈ ఒక్క విషయంలో ఆయన కంటే కమల్ హాసన్ కాస్త ముందున్నారు. తాను రాజకీయాలలో ప్రవేశించబోతున్నట్లు నిర్ద్వందంగా ప్రకటించారు. ఆయన పుట్టిన రోజైన నవంబర్ 7వ తేదీన పార్టీని ప్రకటిస్తారని చాలా జోరుగా ప్రచారం జరిగింది. కానీ పార్టీ ఏర్పాటు ప్రక్రియ చాలా క్లిష్టమైనదని, కనుక దానికి మరొక 9-10 నెలల సమయం పడుతుందని కమల్ హాసన్ స్వయంగా తెలిపారు.  

ఇక రజనీ విషయానికి వస్తే కొన్ని రోజుల క్రితమే ఆయన చెన్నై విమానాశ్రయంలో విలేఖరులతో మాట్లాడుతూ, రాజకీయాలలోకి ప్రవేశించవలసిన అవసరం ఇప్పుడు కనబడటం లేదని కనుక ఇప్పట్లో తాను రాజకీయాలలోకి రాదలచుకోలేదని స్పష్టంగా చెప్పారు. కానీ ఆయన సోదరుడు సత్యనారాయణరావు నిన్న అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడటం విచిత్రం. 

“రజనీకాంత్ 2018 జనవరిలో రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. అయన రాజకీయాలలోకి రావాలని, అయన వస్తే తమిళనాడు రాష్ట్రానికి, ప్రజలకు చాలా మేలు చేస్తారని అందరూ భావిస్తున్నారు. జనవరిలో పార్టీ ఏర్పాటుపై నిర్దిష్టమైన ప్రకటన చేస్తారు,” అని ధర్మపురిలో విలేఖరులకు తెలిపారు. ఈ మాటకు రజనీకాంత్ ఎంతవరకు కట్టుబడి ఉంటారో చూడాలి. మళ్ళీ అటువంటి ఆలోచనేదీ చేయడం లేదని చెప్పినా ఆశ్చర్యం లేదు.

ఒకవేళ ఈ ఇద్దరు హీరోలు వేర్వేరుగా రాజకీయ పార్టీలు స్థాపించినట్లయితే తమిళనాడులో మరో సరికొత్త రాజకీయ వాతావరణం ఏర్పడవచ్చు. జయలలిత మరణం తరువాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులను సరిదిద్దే ప్రయత్నంలో ఉద్భవించబోతున్న కొత్త పార్టీలు, ఇప్పటికే ఉన్న పాత పార్టీలు, మళ్ళీ వాటిలో గ్రూపులు అన్నీ కలిసి రాజకీయ అనిశ్చితిని మరింత పెంచే అవకాశాలే కనిపిస్తున్నాయి. 


Related Post