రాజన్ విమర్శలు మోడీని ఉద్దేశ్యించి చేసినవేనా?

November 29, 2017


img

ఆర్.బి.ఐ. మాజీ గవర్నర్ రఘురామ రాజన్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు విన్నట్లయితే అవి ప్రధాని మోడీని ఉద్దేశ్యించి అన్నవేనా? అనే సందేహం కలుగక మానదు.

"మన దేశానికి ఎటువంటి నాయకత్వం అవసరం ఉందిప్పుడు?" అనే విలేఖరి ప్రశ్నకు సమాధానంగా "దురదృష్టవశాత్తు ప్రజలు నియంతలను ఎన్నుకొంటుంటారు. నియంతల పాలనలో ఒక్కోసారి వేగంగా అభివృద్ధి జరిగువచ్చు మరొకసారి అభివృద్ధి స్తంభించిపోవచ్చు. కనుక మనకు ప్రజాస్వామ్య వ్యవస్థే సరైనది. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా నియంతృత్వ పోకడలు కనిపిస్తున్నాయిప్పుడు. ప్రజల అభిప్రాయాలను వినే నాయకులు మనకు కావాలి తప్ప బోలెడు మంది అనుచరులను వెంటేసుకొని తిరిగేవారు కాదు. అలాగని ప్రజలు చెప్పిన ప్రతీమాటను తూచా తప్పకుండా పాటించాలని కాదు. సరైన నాయకుడు ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొంటూనే దేశాన్ని, ప్రజలను సరైన దిశలో నడిపిస్తాడు," అని అన్నారు. 

 "మితిమీరిన స్వేచ్చ కలిగిన మన ప్రజాస్వామ్యం దేశాభివృద్ధికి దోహదపడుతోందా లేక స్పీడ్ బ్రేకర్ గా మారిందా?" అనే ప్రశ్నకు సమాధానంగా "ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ అభివృద్ధికి అదే తగినది. అయితే ఆ లోటుపాట్లను సవరించుకోగలిగితే మరింత వేగంగా అభివృద్ధి జరుగుతుంది. దీర్ఘకాలిక అభివృద్ధికి ప్రజాస్వామ్యం మాత్రమే సరైనది. ముఖ్యంగా భిన్న సంస్కృతులు, మతాలు, బాషలు కలిగిన భారత్ కు ప్రజాస్వామ్య విధానమే సరిపోతుంది," అని రాజన్ అన్నారు. పాలకులకు దూరదృష్టి, దేశ ప్రజలందరినీ ఒకే త్రాటిపై నడిపించగల సమర్ధమైన నాయకత్వ లక్షణాలు చాలా అవసరమని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. 

రాజన్ చెప్పినవాటిలో ప్రధాని నరేంద్ర మోడీకి మంచి నాయకత్వ లక్షణాలు, దూరదృష్టి ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా నియంతృత్వపోకడలు  ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయం రాజన్ మాటలలో వినిపిస్తోంది. బహుశః నోట్లరద్దు, జి.ఎస్.టి. అమలు విషయంలో మోడీ, దేశ ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని, వాటిని బలవంతంగా ప్రజలపై రుద్దారనే రాజన్ అభిప్రాయం కావచ్చు. అంటే రాజన్ ఆర్.బి.ఐ. గవర్నర్ గా ఉన్నప్పుడు మోడీ నిర్ణయాలను వ్యతిరేకించి ఉండవచ్చుననే సందేహం కలుగుతోంది. బహుశః అందుకే అయన పదవి నుంచి తప్పుకొనేవరకు భాజపా ఎంపి సుబ్రహ్మణ్యస్వామి వెంటపడ్డారేమో? బహుశః అందుకే ప్రధాని మోడీ స్వామిని గట్టిగా వారించలేదేమో? ఏమో!  


Related Post