నిన్న మెట్రోను నడిపింది ఎవరో తెలుసా?

November 29, 2017


img

ప్రధాని నరేంద్ర మోడీ నిన్న హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులను ప్రారంభించిన తరువాత గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటిఆర్, మెట్రో అధికారులతో కలిసి మియాపూర్ స్టేషన్ నుంచి కూకట్ పల్లి వరకు మళ్ళీ అక్కడి నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. అటువంటి వివివిఐపిలు ప్రయాణిస్తున్న మెట్రో రైలును నడిపింది ఎవరో తెలుసా? ఒక మహిళా డ్రైవర్. ఆమె పేరు ఎస్. సుప్రియ. మెట్రో రైలు డ్రైవర్ అని సుప్రియను తేలికగా తీసుకోవడానికి లేదు. ఆమె సిబిఐటి నుంచి ఎం.టెక్ చేసింది. 

సుప్రియ స్వస్థలం నిజామాబాద్ పట్టణం. తండ్రి ప్రమోద్ కుమార్ ఒక ప్రైవేట్ విద్యాసంస్థలో ఉద్యోగి. తల్లి ప్రభావతి ఏపి డెయిరీలో పని చేసి రిటైర్ అయ్యారు. 

సుప్రియ చిన్నప్పటి నుంచే ఆట పాటలు, చదువులలో చాలా హుషారుగా ఉండేది. సంగీతంలో కూడా మంచి ప్రావిణ్యం ఉంది. సాధారణంగా కొందరు మగపిల్లలు చిన్నప్పటి నుంచే ఇంట్లోని ఆట వస్తువులు, సైకిళ్ళు వంటివి రిపేర్లు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. సుప్రియకు కూడా చిన్నప్పటి నుంచే ఆ అలవాటు అబ్బడం విశేషం. అందుకే ఆమె మెకానికల్ ఇంజనీరింగ్ అభ్యసించింది. మగపిల్లలతో సమానంగా ఎటువంటి బైక్స్ అయినా ఆమె అలోకగా నడిపించగలదు. 

ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులలో ‘రైలు నడిపితే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన మొదలయిందని సుప్రియ చెప్పింది. ఆమె ఆలోచనలను తల్లితండ్రులు కూడా ప్రోత్సహించడంతో ఎం.టెక్ లో కోర్ సబ్జెక్ట్ గా “మెట్రో రైల్ లోకో పైలట్” ను ఎంచుకొంది. ఆ కోర్సులో భాగంగా డిల్లీ, ముంబై మెట్రో రైళ్ళ వ్యవస్థలపై అధ్యయనం చేసి ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసింది. 

“మెట్రో రైల్ పైలట్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో మెట్రో పైలట్లు కావాలనే ప్రకటన వచ్చింది. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేయడం ఇంటర్వ్యూ కు పిలుపు రావడం, దానిలో నేను ఎంపిక అవడం, ఆ తరువాత మెట్రో రైల్ నడపడంలో ఏడాదిన్నర కాలంపాటు తగినంత శిక్షణ పొందడం అన్నీ చకచకా జరిగిపోయాయి,” అని సుప్రియ చెప్పింది. 

“హైదరాబాద్ మెట్రో రైల్ ను అధికారికంగా మొట్టమొదట నడిపే అవకాశం నాకే రావడం, అందునా ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటిఆర్ వంటి వివివిఐపిలు ప్రయాణిస్తున్న మెట్రో రైల్ నడిపే అదృష్టం నాకు దక్కడం ఇంకా ఆనందంగా ఉంది. మియాపూర్ నుంచి కూకట్ పల్లి వరకు నేను నడిపించాను. రిటర్న్ జర్నీలో మరో పైలట్ నడిపించాడు,” అని సుప్రియ ఆనందంగా చెప్పింది. 

హైదరాబాద్ లో జరుగుతున్న జి.ఈ.ఎస్. సదస్సులో మహిళా సాధికారికత గురించి చర్చలు జరుగుతుంటే, సుప్రియ వంటి మహిళలు దానిని ఆచరణలో చూపిస్తున్నారు. అందుకు ఆమెకు, ఆమెను ఇంతగా ప్రోత్సహించిన ఆమె తల్లి తండ్రులకు కూడా అభినందనలు తెలియజేద్దామా?  



Related Post