సమాజం తీరు మారదా?

November 28, 2017


img

మన దేశంలో ఒక్కో సందర్భంలో సమాజపు ప్రతిస్పందనలు ఒక్కోలా ఉంటాయి. డిల్లీలో నిర్భయఘటన జరిగినప్పుడు యావత్ దేశం కదిలిపోయింది. ఆ తరువాత దేశవ్యాప్తంగా ఎంతమంది మహిళలు, బాలికలు, చిన్నారులు హత్యలు, అత్యాచారాలకు గురవుతున్నా ఎవరూ స్పందించడం లేదు. ఒక మహిళ అత్యాచారానికి గురయిందంటే అందరూ సానుభూతి చూపిస్తారు. కానీ ఒక్కోసారి భాదితురాలినే దోషిగా చూస్తుంటారు.

ఉదాహరణకు మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఒక ప్రైవేట్ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న ఒక విద్యార్ధినిపై ఒక ఆర్మీ జవాను అత్యాచారం చేశాడు. ఆమె బందువుల పిర్యాదు మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. తనపై అత్యాచారం జరిగినందుకు ఆ బాలిక మానసికంగా చాలా క్రుంగిపోయినప్పటికీ, మనోధైర్యం కోల్పోకుండా మళ్ళీ తన చదువులు కొనసాగించాలనుకొంది. అయితే మళ్ళీ ఆమెకు మరో షాక్ తగిలింది. ఆమె తమ పాఠశాలలో చదువుకొన్నట్లయితే తమ పాఠశాల ప్రతిష్ట దెబ్బతింటుందనే సాకుతో ఆమెను తిరిగి చేర్చుకోవడానికి నిరాకరించింది. బహుశః ఆ పాఠశాల విద్యార్ధుల తల్లితండ్రులు కూడా అభ్యంతరం చెప్పే ఉండవచ్చు. 

అక్కడితో ఆమె కష్టాలు తీరలేదు. తనను పాఠశాలలో చేర్చుకోవడానికి ఆ పాఠశాల యాజమాన్యం నిరాకరిస్తోందని ఆమె మేనమామ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడానికి వెళ్ళగా, తమకు రూ.50,000 లంచం ఇస్తేనే కేసు నమోదు చేస్తామని చెప్పి మరో షాక్ ఇచ్చారు. అప్పుడు ఆమె జిల్లా ఎస్పి శివాజీ రాథోడ్ ను ఆశ్రయించగా అయన ఆదేశాల మేరకు పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అత్యాచారానికి గురైన ఒక అభంశుభం తెలియని బాలిక పట్ల సమాజం ఈ విధంగా వ్యవహరించడం సమంజసమేనా? ఆమెకు వరుసగా ఇటువంటి సవాళ్లు, పరిస్థితులు ఎదురవుతుంటే అప్పుడు ఆమె ఏమి చేయాలి?


Related Post