పాపం రైతన్న...ట్రాన్స్ ఫార్మర్ పైనే...

November 27, 2017


img

సిద్ధిపేట జిల్లాలో ఒక రైతన్న అన్యాయంగా బలైపోయాడు. జిల్లాలో కొహేడ్ మండలంలో వరికోలు గ్రామంలో ట్రాన్స్ ఫార్మర్ పై ఫ్యూజువైరులు కాలిపోవడంతో వీరారెడ్డి అనే రైతన్న కొత్త ఫ్యూజ్ వైరు వేస్తుండగా, హటాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో హై వోల్టేజ్ విద్యుత్ షాక్ తగిలి అక్కడే చనిపోయాడు. సాధారణంగా గ్రామాలలో ఇటువంటి విద్యుత్ సమస్యలు వచ్చినప్పుడు, విద్యుత్ కార్యాలయానికి ఫోన్ చేసినా వెంటనే లైన్-మ్యాన్ రాడు. ఎందుకంటే సిబ్బంది కొరత అంటారు. అది వాస్తవం కూడా. కనుక చాలా గ్రామాలలో రైతులు స్థానిక విద్యుత్ కార్యాలయానికి ఫోన్ చేసి సమస్యను వివరించి విద్యుత్ సరఫరా నిలిపివేసి ఇటువంటి చిన్న చిన్న మరమత్తులకు పూనుకొంటుంటారు. పని పూర్తికాగానే వాళ్ళు మళ్ళీ విద్యుత్ కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పిన తరువాత విద్యుత్ సరఫరా పునరుద్దరిస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. దేశంలో చాలా గ్రామాలలో ఇదే పద్ధతి కొనసాగుతోంది.

అయితే ఈసారి ఎక్కడో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా పొరపాటున విద్యుత్ సరఫరా పునరుద్దరించడంతో ఈ విషాదకర ఘటన జరిగింది. విద్యుత్ సిబ్బంది చేయవలసిన పనిని చేసినందుకు వీరారెడ్డి అన్యాయంగా బలైపోయాడని అర్ధమవుతూనే ఉంది. అయితే నిబందనల ప్రకారం విద్యుత్ శాఖ సిబ్బంది చేయవలసిన పనిని రైతులు అనధికారికంగా చేయడం తప్పు నేరమూ కూడా. కనుక ఈ ఘటనలో చనిపోయిన రైతన్నకు బహుశః ఎటువంటి నష్టపరిహారమూ అందకపోవచ్చు.  విద్యుత్ శాఖలో తగినంతమంది సిబ్బందిని నియమించుకొని ఉండి ఉంటే, రైతులు తమ ప్రాణాలతో ఈవిధంగా చెలగాటం ఆడవలసిన అవసరం ఉండేది కాదు. ఇటువంటి విషాదకర ఘటనలు జరిగేవి కావు కదా. 


Related Post