బిత్తిరి సత్తికి పడింది దెబ్బ...ఎందుకో తెలుసా?

November 27, 2017


img

ప్రముఖ తెలుగు వార్తా ఛానల్ వి-6 లో ప్రసారమవుతున్న ‘తీన్మార్’ కార్యక్రమంలో ‘బిత్తిరి సత్తి’ గా నటిస్తున్న కావలి రవికుమార్ పై సోమవారం మధ్యాహ్నం దాడి జరిగింది. అయన వి-6 స్టూడియో నుంచి బయటకు వస్తుండగా అక్కడే అతని కోసం కాపు కాచి ఉన్న మణికంఠ అనే వ్యక్తి హెల్మెట్ తో దాడి చేశాడు. ఊహించని ఆ దాడిలో స్వల్పంగా గాయపడిన రవికుమార్ ను ఛానల్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అతనిపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకొని ప్రశ్నించగా చాలా ఆశ్చర్యకరమైన కారణం చెప్పాడు.

సికింద్రాబాద్ లో కళాసీగూడ ప్రాంతానికి చెందిన మణికంఠ (26) మానసిక పరిస్థితి బాగోలేదు. తాను సినిమాలలో కధారచయితగా, దర్శకుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పాడు.  వి-6 లో ప్రసారమవుతున్న ‘తీన్మార్’ కార్యక్రమంలో ‘బిత్తిరి సత్తి’ తెలంగాణా బాషను అవహేళన చేస్తున్నట్లు మాట్లాడటం తాను సహించలేకపోయానని, అందుకే ముందుగా ఆ పాత్ర చేస్తున్న వ్యక్తి (కావలి రవికుమార్)కి గట్టిగ బుద్ధి చెప్పి, ఆ ఛానల్ ను మూయించిన తరువాతే సినీ పరిశ్రమలోకి వెళ్ళాలని నిర్ణయించుకొన్నానని చెప్పాడు. తెలంగాణా బాషను వెకిలిగా చూపిస్తే సహించబోనని హెచ్చరించాడు. బిత్తిరి సత్తిపై దాడి చేయడానికి కొన్ని సార్లు రెక్కీ కూడా నిర్వహించానని చెప్పాడు. అతను స్టూడియో నుంచి బయటకు వచ్చే సమయం కనిపెట్టి పధకం ప్రకారమే అతనిపై దాడి చేశానని మణికంఠ చెప్పాడు. అతను పొంతనలేని సమాధానాలు చెపుతుండటంతో అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు గుర్తించారు. అయినప్పటికీ కేసు నమోదు చేశారు. 

నిజానికి తెలుగు సినిమాలలో చాలా కాలంగా కమెడియన్ల చేత, విలన్ల చేత తెలంగాణా మాండలికంలో మాట్లాడిస్తూ దానిని కామెడీ లేదా రాక్షసత్వానికి ప్రతీకగా చూపిస్తూ తెలంగాణా ప్రజల మనసులను గాయపరుస్తూనే ఉన్నారు. వారి మనసులు ఎంతగా గాయపడుతున్నాయో తెలియజేస్తోంది ఈ సంఘటన. ఒక మానసిక రోగి కూడా తెలంగాణా బాషపై ఇంత మమకారం కలిగి ఉండటం గొప్ప విషయమే. కామెడీ కోసం తెలంగాణా బాషను ‘బిత్తిరి సత్తి’ వెకిలిగా ఉపయోగించడంతో అతని మనసు నొచ్చుకొందని అర్ధమవుతోంది. 

మణికంఠ మానసిక రోగి కావచ్చు కానీ తెలంగాణా ఏర్పడినప్పటికీ తెలంగాణా బాష ఇంకా అవహేళన చేయబడుతోందనే అతని వాదనను ఎవరైనా కాదనగలమా? తెలంగాణా బాష ఔనత్యాన్ని, దానిలో ఉండే మాధుర్యాన్ని ప్రజలు గుర్తించేలా చేయవలసిన ఎలక్ట్రానిక్ మీడియా కూడా దానిని ఈవిధంగా కామెడీ సరుకుగా ఉపయోగించుకోవడం శోచనీయం. మిగిలినవారు ఆ మాట పైకి చెప్పడం లేదు కానీ మణికంఠ తనకు తెలిసిన విధానంలో తన ఆగ్రహం వ్యక్తం చేశాడనుకోవచ్చు.


Related Post