వైకాపాకు మరోషాక్

November 27, 2017


img

ఏపిలో వైకాపాకు అధికార తెదేపా మరోపెద్ద షాక్ ఇచ్చింది. విశాఖ జిల్లాలోని పాడేరు వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సోమవారం ఉదయం 10 గంటలకు ఏపి సిఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరారు. ఆమెతోబాటు ఆమె నియోజకవర్గంలో ఎంపిటిసి.,జెడ్.పి.టి.సి.లు ఆమె అనుచరులు కూడా తెదేపాలో చేరారు. వారందరికీ చంద్రబాబు తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే తెదేపాలో చేరానని గిడ్డి ఈశ్వరి చెప్పుకొన్నప్పటికీ, వచ్చే ఎన్నికలలో ఆమెను పక్కన పెట్టి వేరే వారికి టికెట్ ఇవ్వాలని వైకాపా అధిష్టానం ఆలోచిస్తున్నట్లు విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు మాట్లాడుకొన్న మాటలు ఆమె చెవినపడటంతో ఆమె అప్రమత్తమయ్యి వెంటనే తెదేపాలోకి మారిపోయారు. ఆమెతో కలిపి మొత్తం 22 మంది వైకాపా ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపిలు తెదేపాలో చేరినట్లయింది. ఆమెను పార్టీలో చేర్చుకోవడంపై తెదేపా, వైకాపాల వాదోపవాదాలు విమర్శలు, ఆరోపణలు షరా మామూలుగానే సాగుతున్నాయి. 

వచ్చే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలనే అభిలాషతో జగన్మోహన్ రెడ్డి ఆరు నెలలపాటు ఏపిలో 3,000 కిమీ పాదయాత్ర చేస్తూ ప్రజలకు అప్పుడే అనేక హామీలు గుప్పిస్తున్నారు. కానీ అయన పాదయాత్ర ముగిసే సరికి వైకాపాలో జగన్, విజయసాయి రెడ్డి, మరో 2-3 ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని తెదేపా చేసిన హెచ్చరికలను జగన్ తేలికగా తీసుకొన్నట్లుంది. హెచ్చరించినట్లే వైకాపా ఎమ్మెల్యేలు, నేతలను తెదేపాలో రప్పించేందుకు తెదేపా గట్టి ప్రయత్నాలు చేస్తోందని గిడ్డి ఈశ్వరి చేరికతో రుజువైంది. 

చంద్రబాబు నాయుడు తమ ప్రాంతంలో అడుగుపెడితే కత్తులు, బాణాలతో పొడిచి చంపుతామని కొంతకాలం క్రితం ఆమె ఘాటుగా హెచ్చరించారు. అందుకు ఆమెపై పోలీసు కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు ఆమె, చంద్రబాబు ఒకరినొకరు ప్రశంసించుకొంటూ ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం విశేషం. బాబును అంత తీవ్రంగా వ్యతిరేకించిన ఆమెనే నయాన్నో, భయన్నో తెదేపాలోకి రప్పించగలిగినప్పుడు, వివిధ కారణాలతో ఊగిసలాడుతున్న వైకాపా ఎమ్మెల్యేలను, నేతలను తెదేపాలోకి రప్పించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కనుక వచ్చే ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అవ్వాలని జగన్ కలలు కంటూ పాదయాత్రలు చేసుకొంటూపోతే, తెదేపా హెచ్చరించినట్లు అది ముగిసేనాటికి పార్టీలో ఎవరూ మిగలకపోవచ్చు. కనుక ఇప్పుడే మేల్కొనడం మంచిది.            



Related Post