ఆయన పగటి కలలు కంటున్నారా?

November 27, 2017


img

ప్రస్తతం తెలంగాణాలో టిడిపి పరిస్థితి ఏవిధంగా ఉందో సామాన్య ప్రజలకు కూడా తెలుసు. కనుక ఆ సంగతి టిటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణకు తెలియదనుకోలేము. కానీ అయన వచ్చే ఎన్నికలలో తెదేపాయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్ ను ప్రభుత్వాసుపత్రిగా మారుస్తామని చెపుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. సూర్యాపేటజిల్లాలో కోదాడ మండలం దొరకుంటలో నిన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహం ఆవిష్కరించిన సందర్భంలో తెదేపా కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ అయన ఈ మాటలు అన్నారు. 

తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ ను ప్రభుత్వాసుపత్రిగా మారుస్తామని అయన ఇదివరకు చాలాసార్లు అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కోట్లు ఖర్చు చేసి ప్రగతి భవన్ నిర్మించుకోవడంపై మొదట్లో విమర్శలు వచ్చిన మాట నిజమే. అయితే దానిని ఆయన అధికారిక కార్యక్రమాలకు వినియోగించుకొంటున్న తీరు, అందుకోసం ఆ భవనంలో చేసిన అత్యాధునికమైన ఏర్పాట్లు గమనిస్తున్నవారికి ప్రగతి భవన్ 100 శాతం సద్వినియోగం అవుతోందని, కనుక దానిని నిర్మించడం మంచి నిర్ణయమేనని అర్ధమవుతుంది. అయినా దానిని తన కోసం నిర్మించుకోలేదని, తరువాత ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వారు దానిని ఉపయోగించుకోవడానికే నిర్మించానని, అది తెలంగాణా రాష్ట్ర ఆత్మగౌరవానికి చిహ్నం వంటిదని ముఖ్యమంత్రి కెసిఆర్ చాలాసార్లు చెప్పారు. అది వాస్తవం కూడా. 

ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రగతి భవన్ ను తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వాసుపత్రిగా మారుస్తామని ఎల్.రమణ పదేపదే చెప్పడం వలన దాని పట్ల ప్రజలలో ఏర్పడిన సెంటిమెంట్ దెబ్బ తింటుంది కనుక తెదేపాపట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగేందుకే ఆయన మాటలు దోహదపడతాయని చెప్పవచ్చు. తెలంగాణాలో తెదేపాను భూస్థాపితం చేయడానికి ఎల్.రమణ స్వయంగా ప్రయత్నిస్తున్నారనే రేవంత్ రెడ్డి ఆరోపణలు నిజమని అనుమానించవలసి వస్తుంది. 

ఒకవేళ ఎల్.రమణకు తెలంగాణాలో మళ్ళీ తెదేపాను పటిష్టం చేసుకోవాలనే తాపత్రయం ఉన్నట్లయితే, ప్రజల సెంటిమెంట్లను గౌరవించడం నేర్చుకోవాలి. మళ్ళీ పార్టీని బలపరుచుకొంటూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాడితే మంచిది. ఇటువంటి వ్యర్ధ ప్రగల్భాలతో రోజులు దొర్లించేయవచ్చు కానీ వాటి వలన టిటిడిపికి ఒరిగేదేమీ ఉండదని ఖచ్చితంగా చెప్పవచ్చు. 


Related Post