ఆచార్యా మీకిది తగునా?

November 25, 2017


img

టిజెఏసి అధ్వర్యంలో కొలువుల కోట్లాట సభకు హైకోర్టు అనుమతి మంజూరు చేయడంపై ప్రొఫెసర్ కోదండరాం హర్షం వ్యక్తం చేశారు. శనివారం నల్లగొండలో ఈ సభకు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల గురించి రాష్ట్ర ప్రభుత్వం చెపుతున్నమాటలకు వాస్తవాలకు ఎక్కడా పొంతనలేదు. కనీసం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయకపోగా, ఉన్నవాటినే కుదించే ప్రయత్నం చేస్తోంది. నిజానికి రాష్ట్రంలో 5.20 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటన్నిటినీ భర్తీ చేసినట్లయితే అంతమంది నిరుద్యోగులకు ప్రభుత్వోద్యోగాలు లభిస్తాయి. యువతకు ఉద్యోగాలు లభిస్తే అది ఆరోగ్యకరమైన సామాజికమార్పుకు దోహదపడుతుంది. ప్రభుత్వానికి చిన్న కుటీర పరిశ్రమలపై ఏమాత్రం శ్రద్ధ లేదు. వాటికి తగిన సహాయసహకారాలు అందిస్తే గ్రామీణులు కూడా ఆర్ధికంగా తమ కాళ్ళపై తాము నిలబడగలుగుతారు,” అని అన్నారు. 

సమైక్య రాష్ట్రంలో 23 జిల్లాలున్నప్పుడే ఇంచుమించు 5 లక్షల మంది ఉద్యోగులుండేవారు. వారిలో హైదరాబాద్ లో పనిచేసే ఆంధ్రాకు చెందిన ఉద్యోగులు సుమారు 1.5 లక్ష మంది ఉంటారని, రాష్ట్రం విడిపోయిన తరువాత వారందరూ ఆంధ్రాకు వెళ్ళిపోతారని అంచనా వేశారు. కనుక ఆ మేరకు ఉద్యోగాలు ఖాళీ అవుతాయని అంచనా వేశారు. మిగిలిన 3.50 లక్షల మందిలో కొందరు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో పనిచేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటికే రాష్ట్రంలో సుమారు 2.5 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ మూడేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం మరో 65,000 ఉద్యోగాలు వరకు భర్తీ చేసింది. మరో 1.20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని గట్టిగ చెపుతోంది. అన్నిటినీ కలుపుకొని చూస్తే 2.5 లక్షలు-1.2 లక్షలు+60,000= 4.32 లక్షల ఉద్యోగాలు అవుతాయి.కానీ తెలంగాణాలో ఇప్పుడున్న ఉద్యోగాలు కాకుండా మరో 5.20 లక్షల ఖాళీలు ఉన్నాయని ప్రొఫెసర్ కోదండరాం చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన లెక్క ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న వారితో కలుపుకొంటే తెలంగాణాలో సుమారు 8 లక్షలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయని భావించవలసి ఉంటుంది. ఒక చిన్న రాష్ట్రంలో అన్ని లక్షల ప్రభుత్వోగాలు ఉన్నాయంటే నమ్మశక్యంగా ఉందా? 

తెలంగాణా జిల్లాల పునర్విభజన చేసి కొత్తగా 21 జిల్లాలు సృష్టించినప్పటికీ బౌగోళికంగా రాష్ట్రం అంతే ఉంటుంది. కొత్తగా ఏర్పడిన జిల్లాల ద్వారా మరో 25-50,000 కొత్త ఉద్యోగాలు వస్తాయంటే నమ్మశఖ్యంగా ఉంటుంది కానీ ఏకంగా 5.20 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని ప్రొఫెసర్ కోదండరాం చెప్పడం హాస్యాస్పదంగానే ఉన్నాయి. మేధావిగా గుర్తింపు పొందుతున్న ప్రొఫెసర్ కోదండరాం రాజకీయ వాసనలు అంటించుకొని ఈవిధంగా యువతను రెచ్చగొట్టి తప్పుదారి పట్టించడం సబబు కాదు. అంతకంటే, ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఏమేమి మార్గాలున్నాయో సూచిస్తే బాగుంటుంది కదా? 


Related Post