తెదేపాలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు

November 24, 2017


img

ఒకప్పుడు సమైక్యరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకు దూరం అయిపోయారు. ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరారు. ఇంతకు ముందు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డిని తీవ్రంగా విమర్శించేవారు. కానీ ఇపుడు అందుకు భిన్నంగా మాట్లాడటం విశేషం. 

“హేతుబద్దత లేని రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి  పోరాడారు. రాష్ట్ర విభజన చేస్తున్న సోనియా గాంధీతో జగన్మోహన్ రెడ్డి తెరవెనుక చేతులు కలిపితే, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్ర భవిష్యత్ కోసం చివరి నిమిషం వరకు పోరాడారు. చిత్తూరు జిల్లాలో 8 సార్లు గెలిచిన నల్లారి కుటుంబం అంటే నాకు ఎంతో గౌరవం. తన నియోజకవర్గం అభివృద్ధి కోరి కిషోర్ కుమార్ రెడ్డి తెదేపాలో చేరుతున్నారు. ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను,” అని చంద్రబాబు అన్నారు. 

నిజానికి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనలో హేతుబద్దత ఉండాలని కోరలేదు. రాష్ట్ర విభజననే వ్యతిరేకించారు. ఆయన రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నట్లు పైకి నటించినప్పటికీ, ఆ ప్రక్రియ సజావుగా సాగడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున చివరి నిమిషం వరకు కేంద్రానికి  అవసరమైన సహాయసహకారాలను పూర్తిగా అందించారు. నిజం చెప్పాలంటే, కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత విధేయత కనబరిచి, దాని ఆలోచనలను ఖచ్చితంగా అమలుచేసి, తనకు అప్పగించిన బాధ్యత పూర్తిచేయగానే రాజకీయాల నుంచి పక్కకు తప్పుకొన్నారు. 

ఒకవేళ ఏపిలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకొని ఉండి ఉంటే ఆయన తప్పకుండా దానిలోకే వెళ్ళి ఉండేవారు. కానీ ఏపిలో కాంగ్రెస్యి పార్టీ దాదాపు అదృశ్యమైపోవడంతో, తెదేపా వైపు చూస్తున్నట్లున్నారు. అయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటునప్పటికీ వచ్చే ఎన్నికలకు ముందు తెదేపాలో చేరే అవకాశం ఉందని భావించవచ్చు. బహుశః అందుకే ముందుగా తమ్ముడిని తెదేపాలోకి పంపించి ఉండవచ్చు.

చిత్తూరు జిల్లాలో రెండు బలమైన రాజకీయ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లారి, నారావారి కుటుంబాలు చేతులు కలుపడం వలన వచ్చే ఎన్నికలలో ఆ జిల్లాలో వైకాపాకు నెగ్గుకురావడం కష్టమే కావచ్చు. 


Related Post