హైకోర్టులో తెరాస సర్కార్ కు ఎదురుదెబ్బ

November 24, 2017


img

ఉపాద్యాయ నియామకాల ప్రక్రియలో తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి వీలుగా అక్టోబర్ 10వ తేదీన జీవో నెంబర్:25 జారీ చేసింది. దాని ఆధారంగా టి.ఎస్.పి.ఎస్.సి. నోటిఫికేషన్స్ జారీ చేసింది. దానిని వ్యతిరేకిస్తూ అదిలాబాద్ కు చెందిన ముగ్గురు యువకులు హైకోర్టులో పిటిషన్ వేశారు. 

కొత్త జిల్లాల ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తే తమ వంటి నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారని, కనుక పాత జిల్లాల ప్రకారమే నియామకాలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోరారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకొంటున్నామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి కొత్త జిల్లాలను ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. పైగా కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్రపతి గుర్తింపు, ఆమోదం కూడా లేదు కనుక వాటిని ప్రాతిపదికగా తీసుకోవడం రాజ్యాంగ విరుద్దం అవుతుందని వాదించారు. కనుక కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం టి.ఎస్.పి.ఎస్.సి.జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేసి, మళ్ళీ 10 జిల్లాల ప్రాతిపదికన కొత్త నోటిఫికేషన్ జారీ చేయమని ఆదేశించాలని వాదించారు. 

పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్:25ను సవరించాలని ఆదేశించింది. అలాగే టి.ఆర్.టి. కోసం మళ్ళీ కొత్తగా 10 జిల్లాల ప్రాతిపదికన టి.ఎస్.పి.ఎస్.సి. నోటిఫికేషన్ జారీ చేయాలని, డిసెంబర్ 15వరకు దరఖాస్తులకు గడువు ఇవ్వాలని హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిన ఈ విషయాన్ని పక్కనపెడితే, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం లేదనే కొత్త విషయం ఈ కేసు వలన వెలుగులోకి వచ్చింది. దాని వలన ప్రభుత్వానికి ఎటువంటి సమస్యలు ఎదురవవచ్చో ఈ కేసుతో తెలిసింది. కనుక మున్ముందు ఇటువంటి సమస్యలు తలెత్తకుండా నివారించడానికి కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం పొందడానికి అవసరమైన చర్యలు చేపడితే మంచిది. 


Related Post