బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఇద్దరిదీ చెరో మాట!

November 24, 2017


img

ఖమ్మం జిల్లాలో బయ్యారం ఇనుప ఖనిజం గనులున్నందున అక్కడ ఉక్కు కర్మాగారం (స్టీల్ ప్లాంట్) స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. తద్వారా అక్కడ ఉన్న ఇనుప ఖనిజం వెలికి తీసి ఉపయోగించుకోవచ్చునని, వేలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ వాదన. 

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ నిన్న డిల్లీలో కేంద్ర గనులశాఖ మంత్రి బీరేంద్ర సింగ్ ను కలిసి బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయవలసిందిగా మళ్ళీ గుర్తు చేశారు. దానికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి కేటిఆర్ మీడియాకు చెప్పారు. కానీ అదే సమయంలో కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ మీడియాకు చెప్పినది అందుకు భిన్నంగా ఉండటం విశేషం. 

“రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు ఇచ్చిన హామీల అమలుకు మేము కట్టుబడి ఉన్నాము. ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి అనేక అంశాలు పరిశీలించవలసి ఉంటుంది. సమీపంలో ఇనుప ఖనిజం విరివిగా లభిస్తుందా లేదా? లభిస్తే అది ఉక్కు ఉత్పత్తికి తగిన నాణ్యత కలిగి ఉందా? సమీపంలో బొగ్గు లభిస్తుందా లేదా? వీటన్నిటినీ అనుసంధానం చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేవా? వంటి అనేక వివరాలు పరిశీలించవలసి ఉంటుంది. ఇది ఒకటి రెండు రోజులలో పూర్తయ్యే ప్రక్రియ కాదు. చాలా సమయం పడుతుంది. ఆంధ్రా (కడపలో), తెలంగాణా రాష్ట్రాలలో ఉక్కుకర్మాగారాల స్థాపన కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అవి పూర్తయ్యేవరకు నిర్దిష్టంగా చెప్పలేము కానీ త్వరలో నివేదిక వస్తే తదుపరి కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి,” అని చౌదరీ బీరేంద్ర సింగ్ అన్నారు. 

బయ్యారంలో ఇనుప గనులున్న మాట వాస్తవమే కానీ అక్కడ లభించే ఇనుము నాణ్యత ఉక్కు ఉత్పత్తికి సరిపోదనే వాదనలు కూడా వినిపించాయి. అయితే రాష్ట్రీయ ఇస్పాట్ నిగం అక్కడ స్టీల్ ప్లాంట్ స్థాపించడానికి 2013లోనే సంసిద్దత వ్యక్తం చేసింది. ఖమ్మంలోని బయ్యారంతో బాటు తెలంగాణాలో మరో రెండు ప్రాంతాలలో ఇనుప గనులున్న 5,300 హెక్టార్ల భూమిని తమకు అప్పగించినట్లయితే, బయ్యారంలో బెనిఫికేషన్ ప్లాంట్, పిల్లెట్స్ తయారీ ప్లాంట్, స్టీల్ మిల్ స్థాపించగలమని ఆ సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఏపి చౌదరి తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు కూడా. అప్పటి నుంచి ఆ ప్రతిపాదనలు కేంద్ర గనుల శాఖవద్దే ఉండి పోయాయి. 

ఆ తరువాత రాష్ట్ర విభజన జరగడం, కేంద్రంలో, తెలంగాణాలో వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పడటం, మోడీ సర్కార్ వివిధ వ్యవస్థలలో అనేక మార్పులు, చేర్పులు సంస్కరణలు చేపట్టడం వంటి పరిణామాల కారణంగా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదనలు ఇంకా ఆలోచన దశలోనే ఉన్నాయి. అదే విషయం కేంద్రమంత్రి చౌదరీ బీరేంద్ర సింగ్ మరోమారు స్పష్టం చేశారని చెప్పవచ్చు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇదేవిధంగా కేంద్రంపై నిరంతరంగా ఒత్తిడి చేస్తూ వచ్చే ఎన్నికలలోగా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణపనులు ప్రారంభింపజేయడం చాలా అవసరమే లేకుంటే అది ఎప్పటికీ కాగితాల మీదనే ఉండిపోయే ప్రమాదం ఉంది.  


Related Post