తెలంగాణా ఆడపడుచులకు నాసి చీరలు...ఇవంకాకు వజ్రాభరణాలా?

November 24, 2017


img

త్వరలో హైదరాబాద్ లో పర్యటించబోతున్న ఇవంకా ట్రంప్ కు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎవరూ ఊహించలేని అద్భుతమైన బహుమతిని ఇవ్వబోతున్నారు. ఆమెకు తెలంగాణా నేతన్నలు నేసిన పట్టుచీరలు, అద్భుతమైన బంగారు వజ్రాభరణాలు బహుమతులుగా సమర్పించుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. వాటిపై రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ స్పందిస్తూ, “తెలంగాణా ఆడపడుచులకు రూ.50 ఖరీదు చేసే నాసిరకమైన బతుకమ్మ చీరలు పంచిపెట్టి, ఇవంకా ట్రంప్ కు పట్టుచీరలు, వజ్రాభరణాలు బహుమతులుగా ఇస్తారా? ముఖ్యమంత్రి కెసిఆర్ అందుకు సిగ్గుపడాలి,” అని ఎద్దేవా చేశారు. 

మీడియాలో వచ్చిన వార్తలు నిజమైతే, జీవితంలో ఎన్నడూ చీర కట్టని ఇవంకా ట్రంప్ కు పట్టుచీరలు బహూకరించడం, ఖరీదైన వజ్రాభరణాలు బహుమతిగా ఇవ్వడం అర్ధరహితం. అది ప్రజాధనాన్ని వృధా చేయడమే అవుతుంది. అపాత్రాదానం అనిపించుకొంటుంది. ఇవంకా ట్రంప్ మనకు అతిధి కనుక ఆమెను సముచితరీతిలో గౌరవించి పంపడం తప్పులేదు. కానీ ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ఇంతగా తాపత్రయపడనవసరం లేదు. మన దేశాధినేతలు అమెరికా వెళ్ళినప్పుడు వారికి ఎవరూ ఇన్ని గొప్ప మర్యాదలు చేసిన దాఖలాలు లేవు. పైగా స్వర్గీయ అబ్దుల్ కలాం అంతటి మహనీయుడు అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు, విమానాశ్రయంలో అధికారులు అయన ధరించిన బూట్లు, సాక్సులు విప్పించి మరీ క్షుణ్ణంగా తనికీలు నిర్వహించి అవమానించారు. ఏమంటే అది తమ దేశ నియమనిబంధనలని నిర్మొహమాటంగా చెపుతుంటారు. కానీ ఎటువంటి అధికారిక హోదా, పదవిలో లేని ఇవాంక ట్రంప్ హైదరాబాద్ లో పర్యటిస్తుంటే ఆమెను ప్రసన్నం చేసుకొనేందుకు పోటీలు పడటం ఎందుకు? ఆమె కోసం మన ఆత్మగౌరవాన్ని, మన నగరాన్ని, మన ప్రజలను అమెరికాకు తాకట్టు పెట్టడం దేనికి? ఆమెను సముచితంగా గౌరవించి పంపితే సరిపోదా? 


Related Post