పాకిస్తాన్ కు క్లారిటీ ఉంది..భారత్ కు ఉందా?

November 23, 2017


img

గడిచిన ఏడు దశాబ్దాలలో భారత్, పాక్ మద్య స్నేహ సంబంధాలు మూడడుగులు ముందుకు..ఆరడులు వెనక్కు అన్నట్లుగానే సాగుతున్నాయి. కారణాలు అందరికీ తెలిసినవే. 

భారత్ విషయంలో పాక్ కు పూర్తి స్పష్టత ఉంది. భారత్ ను శత్రుదేశంగా భావిస్తూ వీలైనపుడల్లా దెబ్బ తీయాలనే పాక్ పాలకుల ఆలోచనలో ఎన్ని ప్రభుత్వాలు మారినా మార్పు రాలేదు. పాక్ లో ఎవరు అధికారంలో ఉన్నా భారత్ ను దొంగదెబ్బ తీయడానికే ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కూడా పాక్ అదే చేసింది. ఉగ్రవాది హఫీజ్ సయీద్ ముంబై ప్రేలుళ్ళ సూత్రధారి అని తెలిసి ఉన్నప్పటికీ, పాక్ ప్రభుత్వం ఇంతకాలం అతనిని కాపాడుతూనే ఉంది. ఇప్పుడు అతనికి స్వేచ్చ ప్రసాదించడం ద్వారా భారత్ పై మళ్ళీ దాడులకు అతనిని సిద్దం చేస్తోంది. అతను కూడా విడుదల కాగానే అదే చెప్పాడు. కనుక భారత్ పట్ల పాక్ వైఖరి ఎప్పుడూ స్పష్టంగా ఉందనే అర్ధం అవుతోంది.    

కానీ భారత్ లో నెహ్రూ కాలం నుంచి మోడీ కాలం వరకు కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రతీ ప్రధాని పాకిస్తాన్ కు స్నేహహస్తం అందిస్తూనే ఉన్నారు. ఆ తరువాత పాక్ చేతిలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు విలవిలాడుతూ, తాత్కాలికంగా తమ ఆగ్రహాన్ని ఏదో రూపంలో వ్యక్తం చేస్తుంటారు. వచ్చే ఏడాది భారత్ లో జరుగబోయే ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో పాక్ జట్టును భారత్ లో ఆడేందుకు అనుమతించరాదనే తాజా నిర్ణయం కూడా అటువంటిదే. 

అయితే పాకిస్తాన్ తో ఆ దేశంలో, విదేశాలలోను క్రికెట్, హాకీ మ్యాచ్ లు ఆడుతున్నప్పుడు లేని అభ్యంతరాలు, పాక్ క్రికెట్ టీం భారత్ లో ఆడితే ఎందుకు అభ్యంతరమో తెలియదు. పాక్ తో రాజకీయ సంబంధాలు వద్దనుకొంటే అందుకు తగ్గట్లుగా వ్యవహరించవచ్చు. కానీ నేటికీ పాకిస్తాన్ కు మన దేశం ‘మోస్ట్ ఫేవర్డ్  నేషన్’ హోదాను కొనసాగిస్తూనే ఉంది. మరి అటువంటప్పుడు ఆ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ కు చెందిన క్రికెట్ జట్టు మన గడ్డపై అడుగుపెట్టకుండా అడ్డుకోవడంలో అర్ధం ఏముంది? ఒకపక్క పాక్ జట్లతో విదేశీ గెడ్డపై ఆడుతూ, పాక్ క్రికెట్ జట్టు భారత్ లో అడుగుపెట్టనీయకుండా చేసినట్లయితే భారత్ ఏమి సాధించగలదు? అంటే ఏమీ లేదనే చెప్పవచ్చు. ఇటువంటి నిర్ణయాలు పాక్ పాలకులను కదిలించలేవు.మార్చబోవు అనే సంగతి పదేపదే రుజువైంది. కనుక ఇటువంటి నిర్ణయాలు పాక్ పట్ల మన వైఖరిలో అస్పష్టతను సూచిస్తాయే తప్ప అదే దౌత్యవిజయం, దౌత్యపరమైన ఒత్తిడి అనుకొంటే పొరపాటే. ఈ అస్పష్టత, మెతక వైఖరి, ముంబై ప్రేలుళ్ళు, దిల్ షుక్ నగర్ ప్రేలుళ్ళు, భారత సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తూ పార్లమెంట్ పై దాడులు, పఠాన్ కోట్ పై ఉగ్రదాడులు, యూరి ఆర్మీ క్యాంప్ పై దాడులను మరిచిపోయే మతిమరుపు గుణం కారణంగానే పాక్ పాలకులు కూడా భారత్ తో దశాబ్దాల తరబడి చెలగాటం ఆడగలుగుతున్నారని చెప్పక తప్పదు. 


Related Post