జైల్లో ఉన్న దురదృష్టం వెంటాడుతూనే ఉందేమిటి?

November 23, 2017


img

అదేదో సినిమాలో హీరో “అతిగా ఆశపడిన ఆడది అతిగా ఆవేశపడిన మగాడు బాగుపడినట్లు చరిత్రలో లేదు” అంటూ ఓ డైలాగ్ చెపుతాడు. అన్నాడిఎంకె మాజీ నేత శశికళకు ఆ డైలాగ్ అక్షరాల సరిపోతుంది. జయ మృతి తరువాత చాలా తెలివిగా, చురుకుగా పావులు కదిపి పార్టీ పీఠం దక్కించుకొన్నాక, ముఖ్యమంత్రిపీఠం కూడా దక్కించుకోవాలని విఫలయత్నాలు చేసి చివరికి జైలు పాలైంది. 

జైలులో ఉన్నా అక్కడి నుంచే తన మేనల్లుడు దినకరన్ ద్వారా చక్రం తిప్పాలనుకొంది. పార్టీ ఎన్నికల చిహ్నమైన ‘రెండాకుల గుర్తు’ తమకే చెందుతుందని ఎన్నికల సంఘం దగ్గర పిర్యాదు చేసింది. అయితే మేనల్లుడు దినకరన్ అత్త కంటే రెండాకులు ఎక్కువే చదివాడు అందుకే రెండాకుల గుర్తును ఎలాగైనా దక్కించుకోవాలనే ఆలోచనతో ఎన్నికల కమీషనర్ కే లంచం ఇవ్వడానికి ప్రయత్నించి దొరికిపోయి, మరొక కొత్త కేసులో ఇరుక్కున్నాడు. 

ఆ తరువాత కొంత మంది అన్నాడిఎంకె ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని, పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్రయత్నించాడు. కానీ తమిళనాడు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు చక్రం అడ్డేయడంతో ఆ ప్రయత్నమూ ఫలించలేదు. 

గత రెండు మూడు వారాలుగా ఐటి అధికారులు శశికళ, దినకరన్, ఆమె బంధువుల ఇళ్ళపై దాడులు చేసి బారీగా వెండిబంగారు ఆభరణాలు పట్టుకొన్నారు. ఐటి దాడులలో శశికళ ఆస్థుల విలువ సుమారు రూ.5 లక్షల కోట్లు ఉన్నాయని కనుగొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. 

ఇక ఇవన్నీ సరిపోవన్నట్లు అన్నాడిఎంకె ఎన్నికల చిహ్నమైన ‘రెండాకుల గుర్తు’ ను ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గానికే చెందుతుందని గురువారం కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రకటించింది. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నప్పటికీ దురదృష్టం వెంటాడుతూనే ఉండటం విశేషం. అయితే అది ఆమె స్వయంకృతాపరాధమేనని చెప్పక తప్పదు. ఈరోజు ఈసీ నిర్ణయంతో శశికళ, దినకరన్ లకు అన్నాడిఎంకెతో సంబంధాలు తెగిపోయినట్లయిపోయాయి. 


Related Post