తెరాస నేత నోట మళ్ళీ ఓటుకు నోటు కేసు ప్రస్తావన!

November 23, 2017


img

సాధారణంగా కొన్ని ముఖ్యమైన అంశాలపై లేదా తమ రాజకీయ ప్రత్యర్ధులపై ఒక పార్టీ నేతలు లేదా ప్రజా ప్రతినిధులు ఏవైనా వ్యాఖ్యలు చేసినట్లయితే వాటిని పార్టీకి అన్వయించలేము. కానీ అవే మాటలు తరువాత ఎప్పుడో ముఖ్యమంత్రి నోట వినిపిస్తుంటాయి. అంటే ముఖ్యమంత్రి అభిప్రాయాలనే వారు వెలిబుచ్చారని భావించవలసి ఉంటుంది. 

గురువారం అయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ఓటుకు నోటు కేసులో నెలరోజులు జైల్లో గడిపి వచ్చిన రేవంత్ రెడ్డి నేరస్థుడిలాగే మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వంపై, మంత్రి కేటిఆర్, ముఖ్యమంత్రి కెసిఆర్ లపై నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. మాకు సంబంధం లేని వ్యవహారాలను కూడా మాతో ముడిపెట్టి మేము అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి అయన వెనుకున్న చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఏదో ఒక రోజు జైలుకు వెళ్ళడం ఖాయం. 

తెలంగాణా శాసనసభకు ఎన్నికైన రేవంత్ రెడ్డి రాజీనామా చేయదలచుకొంటే, ఆ లేఖను శాసనసభ స్పీకర్ కు ఇచ్చి ఆమోదింపజేసుకోవాలి కానీ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రికి ఇవ్వడంలో అర్ధం ఏమిటి? రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ అందినా చంద్రబాబు నాయుడు ఇంతవరకు దానిని తెలంగాణా శాసనసభ స్పీకర్ కు ఎందుకు పంపించడం లేదు? దీనిని బట్టి ఈ వ్యవహారంలో ఇద్దరూ కలిసే డ్రామా ఆడుతున్నారని అర్ధం అవుతోంది. రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉన్నట్లయితే ఇప్పటికైనా ఈ రాజీనామా డ్రామాను కట్టిబెట్టి వెంటనే స్పీకర్ కు రాజీనామా లేఖ ఇచ్చి ఆమోదింపజేసుకోవాలి,” అని అన్నారు.           

ఓటుకు నోటు కేసుతో సహా అనేక అంశాలపై మొదట తెరాస నేతలు, మంత్రులు వెలిబుచ్చిన అభిప్రాయాలనే తరువాత కెసిఆర్ వెలిబుచ్చారు. కనుక ఇప్పుడు తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా ముఖ్యమంత్రి అభిప్రాయంగానే భావించవలసి ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి అతిగా రెచ్చిపోతే మళ్ళీ ఓటుకు నోటు కేసులో కదలికలు వస్తాయని తెరాస సూచిస్తోందని భావించాలేమో? 


Related Post