ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించడం లేదు?

October 23, 2017


img

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభలకు ఇంచుమించు ఒకేసారి గడువు తీరిపోతుంది కనుక రెంటికీ ఒకేసారి ఎన్నికలు జరగల్సి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ కు కేంద్ర ఎన్నికల కమీషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది కానీ భాజపా పాలిత గుజరాత్ కు ఇంతవరకు షెడ్యూల్ ప్రకటించలేదు. 

గుజరాత్ లో తమ పార్టీ అధికారం నిలుపుకోవడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ పదేపదే ఆ రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజలను ఆకట్టుకొనేందుకు పధకాలు, వరాలు ప్రకటిస్తున్నారని, అందుకే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకుండా కేంద్రప్రభుత్వం ఎన్నికల కమీషన్ పై ఒత్తిడి తెస్తోందని కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

ఎన్నికల కమీషన్ ను ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని మోడీ అనడాన్ని మాజీ కేంద్రమంత్రి చిదంబరం తప్పు పట్టారు. “కేంద్రప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకుండా తాత్సారం చేస్తున్న ఎన్నికల కమీషన్ ను ప్రశ్నించకుండా దాని కాళ్ళ మీద పడి బ్రతిమాలుకోవాలా?” అని ప్రశ్నించారు. అసలు ఇంతవరకు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించలేదో కారణాలు చెప్పాలని ఆయన ఎన్నికల కమీషనర్ అచల్ కుమార్ జోతిని నిలదీశారు. 

ప్రతిపక్షాల ఆరోపణలపై కేంద్ర ఎన్నికల కమీషనర్ స్పందిస్తూ, “మాపై ఎవరూ ఒత్తిడి చేయడం లేదు..చేయలేరు. మాకు అన్ని రాజకీయ పార్టీలు సమానమే. గుజరాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇద్దరూ ఎన్నికల ప్రచారం చేసుకొంటున్నారు. ప్రజలకు తమతమ పార్టీల తరపున హామీలు ఇచ్చుకొంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేవరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండదు కనుక రాజ్యాంగం ప్రకారం అన్ని పార్టీలు ప్రచారం చేసుకోవచ్చు. ప్రజలకు హామీలు ఇచ్చుకోవచ్చు. అది తప్పు కాదు,” అని అన్నారు. కానీ గుజరాత్ లో ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించలేదు అనే ప్రశ్నకు సమాదానం దాట వేశారు. 

ఈసారి గుజరాత్ శాసనసభ ఎన్నికలలో భాజపాకు ఎదురుగాలులు వీస్తున్నట్లు సమాచారం. గుజరాత్ ను శాశిస్తున్న పటేల్ కులస్థుల నేత హార్దిక్ పటేల్ ఈరోజు రాహుల్ గాంధీని రహస్యంగా కలుసుకొని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అదే కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీ సగం విజయం సాధించేసినట్లేనని భావించవచ్చు.  



Related Post