పాదయాత్రకు ఓకే..మినహాయింపుకు నాట్ ఓకె!

October 23, 2017


img

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నవంబర్ 2వ తేదీ నుంచి ఆరు నెలలపాటు ఏపిలో 3,000 కిమీ పాదయాత్ర చేయాలనుకొన్నారు. కానీ సిబిఐ కోర్టు జగన్ పాదయాత్రకు ఈరోజు బ్రేకులు వేసింది. 

అక్రమాస్తుల కేసులలో ఎ-1, ఎ-2 నిందితులుగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇద్దరూ కూడా నాంపల్లి సిబిఐ  కోర్టులో ప్రతీ శుక్రవారం జరిగే విచారణకు తప్పనిసరిగా హాజరవుతామనే నిబందనకు అంగీకరించినందునే వారికి బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. కానీ పాదయాత్ర కోసం తనకు వ్యక్తిగత హాజరు నుంచి ఆరు నెలలు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ పిటిషన్ వేశారు. దానిపై సిబిఐ న్యాయమూర్తి ఇరుపక్షాల వాదోపవాదాలు విన్న తరువాత జగన్ పిటిషన్ ను కొట్టివేశారు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి మినహాయింపు ఇవ్వవద్దని సిబిఐతో పాటు ఈడి తరపు న్యాయవాదులు కూడా వాదించడం విశేషం. వారి వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి జగన్ పిటిషన్ ను కొట్టివేశారు. ఆయన కావాలనుకొంటే పాదయాత్ర చేసుకోవచ్చు కానీ ప్రతీ శుక్రవారం తప్పనిసరిగా కోర్టు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. 

జగన్ పాదయాత్ర చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు కనుక ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. బహుశః హైకోర్టులో అప్పీలు చేసుకొంటారేమో? ఒకవేళ అప్పీలు చేసుకోకుండా పాదయాత్ర కొనసాగించదలిస్తే, హెలికాఫ్టర్ ఏర్పాటు చేసుకొని ప్రతీ గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకొని శుక్రవారం కేసు విచారణకు హాజరయ్యి, మళ్ళీ అదే హెలికాఫ్టర్ లో పాదయాత్ర జరుగుతున్న ప్రాంతానికి చేరుకోవలసి ఉంటుంది. 

ఇది కష్టమనుకొంటే వ్యక్తిగత హాజరు నుంచి ఆరు నెలలు మినహాయింపు కోరుతూ మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయపోరాటం ప్రారంభించి దానిలో నెగ్గిణ తరువాతే పాదయాత్ర ప్రారంభించుకోవలసి ఉంటుంది. మరి జగన్ చేస్తారో చూడాలి. 

ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు కనుక జగన్ కి ఆలోచించుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఒకసారి ఎన్నికల హడావుడి మొదలైతే ఎన్నికల ప్రచారం మద్యలో వదిలేసి ఇలాగే ప్రతీ శుక్రవారం కోర్టు విచారణ కోసం హైదరాబాద్ వెళ్ళవలసివస్తే వైకాపా చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. పైగా తెదేపా నేతలు అదే అంశం లేవనెత్తి ప్రజలలో జగన్ పట్ల విముఖత ఏర్పడేలా చేయవచ్చు. కనుక ఈ సమస్య గురించి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే ఆలోచించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం మంచిదేమో?


Related Post