కాకతీయ పార్క్ శంఖుస్థాపన రేపే!

October 21, 2017


img

తెలంగాణా ప్రజలందరూ ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న కాకతీయ టెక్స్ టైల్ పార్క్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం శంఖుస్థాపన చేయబోతున్నారు. దీనిని వరంగల్ రూరల్ జిల్లాలో గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలి, సంగెం మండలంలోని చింతలపల్లి గ్రామాల మద్య ఏర్పాటు చేయబోతున్నారు. దీని కోసం మొత్తం రూ.87.78కోట్లు వెచ్చించి 1,190 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. 

మొత్తం రూ.1,000 కోట్లకు పైబడి అంచనా వ్యయంతో నిర్మించబోతున్న ఈ మెగా టెక్స్ టైల్ పార్క్ దేశంలోకెల్లా అతిపెద్దదిగా నిలువబోతోంది. ఐదు దశలలో నిర్మించబోయే ఈ పార్క్ లో మొదటిదశలో 170.35 ఎకరాల స్థలంలో చిన్నా పెద్దా అన్నీ కలిపి మొత్తం 172 సంస్థలు స్థాపించబడతాయి. 

మొత్తం భూమిలో  63 శాతం అంటే 750 ఎకరాలను పరిశ్రమలకు కేటాయించబడుతుంది. మిగిలిన దానిలో 80 ఎకరాలు మౌలిక సదుపాయాల కోసం, 50 ఎకరాలు ఇతర సౌకర్యాల కోసం, 179 ఎకరాలు అంతర్గత రవాణాకోసం కేటాయించారు. మరో 130 ఎకరాల భూమిని భవిష్యత్ అవసరాల కోసం ఖాళీగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ పార్క్ లో తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో బాటు ఒక విదేశీ సంస్థ కూడా పరిశ్రమ ఏర్పాటు చేయబోతోంది. తమకు ఈ పార్క్ లో 300 ఎకరాలను కేటాయించినట్లయితే దానిలో రూ.1,000 కోట్లు పెట్టుబడితో అతిపెద్ద పరిశ్రమను స్థాపించదానికి సిద్దంగా ఉన్నామని ప్రభుత్వానికి తెలిపింది.

రేపు శంఖుస్థాపన రోజునే కనీసం 15 సంస్థలు ప్రభుత్వంతో అవగాహన పత్రాలపై సంతకాలు చేయబోతున్నట్లు తాజా సమాచారం. వాటికి ప్రభుత్వం భూమి అప్పగించగానే వెంటనే నిర్మాణపనులు చేపట్టడానికి అవి సిద్దంగా ఉన్నట్లు ఇదివరకే మంత్రి కేటిఆర్ కు తెలిపాయి. వాటిలో కొన్ని సంస్థలు భూమిని పొందిన మూడు నెలలోనే ప్రీ-ఫ్యాబ్రికేటడ్ టెక్నాలజీతో షేడ్స్ నిర్మించి ఉత్పత్తి ప్రారంభించగలమని చెప్పాయి.  

ఐదు దశలలో నిర్మితం కాబోయే ఈ టెక్స్ టైల్ పార్క్ లో వస్త్ర పరిశ్రమకు సంబంధించి ఎ-జెడ్ ఉత్పత్తి చేయబడతాయి. దీనిలో స్పిన్నింగ్, టెక్స్‌టైల్, వీవింగ్, నిట్టింగ్ ప్రాసెసింగ్, ఊవెన్ ఫ్యాబ్రిక్, యార్న్ డైయింగ్, టవల్-షీటింగ్, ప్రింటింగ్ యూనిట్లు, రెడీమేడ్ వస్ర్తాలు వంటి తొమ్మిది విభాగాల్లో భిన్నమైన పరిశ్రమలు ఏర్పాటు చేయబడతాయి. అంతే కాకుండా ఈ పరిశ్రమలలో ఉద్యోగాలు పొందడానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యం పొందడానికి జాతీయస్థాయి శిక్షణా సంస్థలు, టెక్స్‌టైల్ కళాశాల ఏర్పాతుచేయబడతాయి. 

తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ టెక్స్ టైల్, వస్త్ర శిక్షణ సంస్థ ఇక్కడ తమ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకొంది. కనుక కనీస విద్యార్హతలు కలిగిన వారు మొదలు బీటెక్, ఎంటెక్ గ్రాడ్యుయేట్స్ వరకు అన్ని స్థాయిలవారికి ఇక్కడ శిక్షణ, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు చాలా బారీ సంఖ్యలో లభిస్తాయి. 

ఇక దీనితో రాష్ట్రంలో పత్తి రైతుల సమస్యలు తొలగిపోవడమే కాకుండా పత్తికి చాలా డిమాండ్ ఏర్పడుతుంది కనుక భవిష్యత్ లో ఇతర పంటలకు బదులు రైతులు అందరూ పత్తి పంట సాగుకే మొగ్గు చూపినా ఆశ్చర్యం లేదు. 

ఈ మెగా టెక్స్ టైల్ పార్క్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి కార్యక్రమాలు ప్రారంభించినట్లయితే తెలంగాణా రాష్ట్రం ముఖచిత్రమే పూర్తిగా మారిపోవాదం ఖాయం. పారిశ్రామిక రంగంలో, ఉత్పత్తి, ఉద్యోగాల కల్పన, ఆదాయపరంగా దేశంలో తెలంగాణా రాష్ట్రం నెంబర్: 1 స్థానంలో నిలబడటం ఖాయం. 


Related Post