ఏమిటి..ఆయన కూడా జంపా?

October 21, 2017


img

టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తనతోబాటు కొంతమంది తెదేపా నేతలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువస్తానని చెప్పినట్లు, అందుకు తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా భాజపా ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి కూడా ఆయనతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలనుకొంటున్నట్లు వార్త లీక్ అయ్యింది. బహుశః దీనిపై చర్చించేందుకే రాష్ట్ర భాజపా నేతలందరూ శనివారం అత్యవసరంగా హైదరాబాద్ లో సమావేశం అయ్యారు. 

తెదేపాకు మిత్రపక్షంగా ఉన్న తమ పార్టీలోకి రేవంత్ రెడ్డి వస్తాడనుకొంటే, ఆయన తమ పార్టీలో నుంచే నేతలను వెంటతీసుకుపోవాలనుకోవడం వారికి షాక్ అని చెప్పవచ్చు. అయితే నాగం జనార్ధన్ రెడ్డి మాత్రం ఇంతవరకు బయటపడలేదు. తెదేపాలో చాలా బాగా రాణించిన ఆయన భాజపాలోకి వచ్చిన తరువాత తన ఉనికిని కోల్పోయారు. రాష్ట్ర భాజపా నేతలతో సఖ్యత లేకపోవడంతో పార్టీలో ఇమడలేకపోతున్నారు. తనకు పార్టీలో సరైన గుర్తింపు, గౌరవం లేదని బాధపడుతున్నారు. కనుక ఆయన రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యమేమీ లేదు. అలాగే ఆయన వెళ్ళిపోయినా భాజపాకు కూడా కొత్తగా వచ్చే నష్టమేమీ లేదని రాష్ట్ర భాజపా నేతలకు తెలుసు. కానీ అది ఆయనతో ఆగితే పరువాలేదు కానీ వెంట మరికొంతమంది వెళ్ళిపోతే ప్రమాదమే. కనుక ఉన్నవాళ్ళను వదులుకొనే బదులు రేవంత్ రెడ్డినే పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుంది కదా? బహుశః అందుకే రాష్ట్ర భాజపా నేతలు అత్యవసరంగా సమావేశం అవుతున్నారేమో? సమావేశం ముగిసిన తరువాత ఎలాగూ మీడియాతో మాట్లాడుతారు కనుక రేవంత్ రెడ్డి గురించి వారు ఏమనుకొంటున్నారో తెలియవచ్చు. 


Related Post