కాంగ్రెస్ పార్టీని అయన కాపాడగలడా?

October 21, 2017


img

ఏ పార్టీకైనా ఎన్నికలు ముఖ్యమైనవే..ఐదేళ్ళు ప్రతిపక్ష బెంచీలలో కూర్చొన్న పార్టీలకు మరీ ముఖ్యం. అందుకే వచ్చే ఎన్నికల కోసం టిపిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసుకొనేందుకు రేవంత్ రెడ్డి, అజహారుద్దీన్ వంటివారికి రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం చెపుతున్నారు. అయితే, పార్టీలో హేమాహేమీల వంటి అనేకమంది కొమ్ములు తిరిగిన నేతలుండగా వారి కంటే బయట నుంచి వచ్చిన వారే పార్టీని కాపాడి ఒడ్డునపడేయగలరన్నట్లు వ్యవహరిస్తుండటం ఆశ్చర్యంగానే ఉంది.

గతంలో యూపి మొరాదాబాద్ నుంచి ఎంపిగా చేసిన అజారుద్దీన్ 2014 ఎన్నికలలో రాజస్థాన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన హైదరాబాద్ లోనే ఉంటునప్పటికీ ఏనాడూ కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించిన దాఖాలాలు కూడా లేవు. కనుక పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం ఊహించలేము. అటువంటి వ్యక్తిని ఉత్తం కుమార్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి “మీకు వచ్చే ఎన్నికలలో లోక్ సభ, శాసనసభ.. ఏ టికెట్ కావాలంటే అదిస్తాం. పార్టీ తరపున కాస్త ప్రచారం చేసి పెట్టండి,” అని బ్రతిమాలుకోవడం చాలా విడ్డూరంగా ఉంది.

రాష్ట్రంలో ముస్లిం ఓటర్లను ఆకర్షించడానికి ఆయనైతే సరిపోతాడని ఉత్తం కుమార్ రెడ్డి భావిస్తున్నారేమో? అదే నిజమైతే షబ్బీర్ అలీ వంటి నేతల వలన ప్రయోజనం లేదని భావిస్తున్నారేమో? అయినా అజారుద్దీన్ కు రాష్ట్రంలో ముస్లింలందరినీ ఆకట్టుకొనే శక్తే ఉంటే ఎక్కడో యూపి, రాజస్థాన్ లకు వెళ్లి పోటీ చేసే బదులు హైదరాబాద్ లోనే చేసేవారు కదా? ఆయనకు అంత శక్తే ఉన్నట్లయితే ఇతర పార్టీలు ఇంతకాలం ఆయనను పట్టించుకోకుండా వదిలిపెట్టేవి కావు కదా? ఆయనే స్వంత కుంపటి పెట్టుకొని ఉండేవారు కదా?  

కారణాలు ఏవైనప్పటికీ, కనబడినవారిని అందరికీ బొట్టు పెట్టి పార్టీలోకి ఆహ్వానించడం వలన పార్టీలో మిగిలిన నేతలు తీవ్ర అసంతృప్తికి లోనవడం ఖాయం. అప్పుడు వారు గట్టిగా పట్టుబడితే 2014 ఎన్నికల సమయంలో పొన్నాలను దింపేసినట్లుగా ఈ ఎన్నికలకు ముందు ఉత్తం కుమార్ రెడ్డిని కూడా దింపేసే ప్రమాదం ఉంది. కనుక ఉత్తం కుమార్ రెడ్డి బయటి నుంచి నేతలను రప్పించడం కంటే పార్టీలో నేతలందరినీ తనతో కలుపుకుపోవడం చాలా అవసరం.  


Related Post