బీసిలకు సబ్సీడీ రుణాల ఫైల్ క్లియర్

October 21, 2017


img

తెలంగాణా రాష్ట్రంలో బిసి జనాభా చాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ వారిలో అత్యధికశాతం పేదలే. రాజకీయ పార్టీలన్నీ వారిని ఓటు బ్యాంకుగానే చూసాయి తప్ప వారిని ఆదుకోవడానికి చేసిందేమీ లేదు. 2014 ఎన్నికలలో రాష్ట్రంలో బీసిలను ఆకర్షించి గెలవాలనే ఆలోచనతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హటాత్తుగా బీసి సంఘాల నేత ఆర్.కృష్ణయ్యను పార్టీలోకి రప్పించి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడం అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ తెదేపా ఓడిపోవడంతో తరువాత ఆయనను కూడా పులిహోరలో కరివేపాకులాగ తీసి పక్కన పడేయడం అందరూ చూశారు. బీసిలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ గా మాత్రమే ఏవిధంగా చూస్తున్నాయని తెలుసుకొనేందుకు ఇది ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

ఇంతకు ముందు పదేళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో బీసీలకు చేసిందేమీ లేదు. ఒకవేళ చేసినా వాటితో వారి జీవితాలలో ఎటువంటి మార్పు రాలేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చిపోతున్నా వారి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. 

ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ బాగానే గ్రహించారు. అందుకే వివిద కులవృత్తుల వారికోసం చేపల పెంపకం విభిన్నమైన సంక్షేమ పధకాలు చేపడుతున్నారు. ఉదాహరణకు మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో పూడికలు తీసి నీళ్ళతో నింపిన తరువాత వాటిలో లక్షల చేప పిల్లలను విడిచిపెడుతున్నారు. వాటి ద్వారా రాష్ట్రంలో మత్స్యకారులకు ఉపాధి మార్గం చూపించారు. అలాగే గొల్ల కురుములకు సబ్సీడీ గొర్రెలు, పాడిపశువులు, రైతులకు విత్తనాలు, ఎరువులు వగైరా అందిస్తున్నారు. వీటికి అదనంగా మళ్ళీ సబ్సీడీ రుణాలను కూడా అందజేస్తున్నారు. 

దాని కోసం రూ.102.8 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సంబందిత ఫైల్ పై సంతకం చేశారు. రాష్ట్రంలో వివిధ బిసి కులాలకు చెందిన కొన్ని వేలమంది సబ్సీడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకొన్నారు. వారిలో 12, 218 మందికి 12 ఫెడరేషన్స్ ద్వారా ఈ సబ్సీడీ రుణాలను అందజేస్తామని బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. 


Related Post