రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బలు

October 21, 2017


img

టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపడం తొందరపాటని నిరూపిస్తున్నట్లుగా ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ‘పార్టీ అధిష్టానానికి చెప్పకుండా, అనుమతి తీసుకోకుండా ఏ అధికారంతో నువ్వు డిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కలిసావు?’ అని తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు నిన్న తెదేపా పోలిట్ బ్యూరో సమావేశంలో నిలదీసినప్పుడు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పలేక తడబడ్డారు. 

పార్టీ మారే విషయంలో రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోని తన అనుచరులను కూడా సంప్రదించకపోవడంతో వారు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్న తెరాసలో చేరిపోయి ఆయనకు షాక్ ఇచ్చారు. ఆయన ముఖ్య అనుచరులలో మద్దూర్ కు చెందిన అనసూయ బాల సింగ్ నాయక్, సంగీత శివకుమార్, శివారాజ్, వీరేశ్ గౌడ్ తదితరులు నిన్న మంత్రి ఈటెల రాజేందర్ సమక్షంలో తెరాసలో చేరిపోయారు. దీంతో రేవంత్ రెడ్డి సైన్యం లేని సైన్యాధ్యక్షుడిగా మారారు. 

ఒకపక్క తెదేపా సీనియర్ నేతలు, మరోపక్క అనుచరులు, ఇంకోపక్క కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల నుంచి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారిప్పుడు. తను పార్టీ మారబోతున్నాననే సంకేతాలు ఇచ్చినప్పుడు అందరి దృష్టిని ఆకర్షించగలిగారు కానీ ఒక్క రోజులోనే అందుకు పూర్తిభిన్నమైన వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కోవలసివస్తోంది. 

కధ ఇంతవరకు వచ్చిన తరువాత ఇక ఆయన తెదేపాలో కొనసాగడం కష్టమే. కనుక కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంకా వ్యతిరేకత పెరుగక మునుపే వీలైనంత త్వరగా పార్టీ మారక తప్పదు. ఆయన భాజపాలో చేరే ఆలోచన చేసి ఉండి ఉంటే బహుశః ఇన్ని సమస్యలు ఎదుర్కోవలసి వచ్చేది కాదేమో? కానీ రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాలేదని భావించి ఆ అవకాశాలున్న కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్లున్నారు. ఏమైనప్పటికీ, రేవంత్ రెడ్డి కాస్త తొందపడినట్లే ఉన్నారు కానీ ఇప్పుడు ఇంకా తొందరపడటం కూడా అవసరం లేకుంటే చాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. 


Related Post