జనసేనపై తెదేపా యుద్ధం ప్రకటించేసినట్లేనా?

October 06, 2017


img

నాలుగు రోజుల క్రితం జనసేన అధికారిక ట్విట్టర్ పేజిలో “వచ్చే ఎన్నికలలో తమ పార్టీ 175 స్థానాలకు లేదా ఎన్ని స్థానాలలో బలం ఉంటే అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని” ఒక మెసేజ్ పెట్టారు. మీడియాలో ఆ వార్త ప్రముఖంగా రావడంతో వెంటనే దానిని తొలగించేశారు. ఆ పోస్టును పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మాటలను తప్పుగా అర్ధం చేసుకొని ఆవిధంగా పెట్టారని జనసేన ప్రతినిధి మీడియాకు వివరించినప్పటికీ, అప్పటికే జరుగాకూడని నష్టం జరిగిపోయింది. వచ్చే ఎన్నికలలో తెదేపా, భాజపాలను జనసేన ఒంటరిగా ఎదుర్కోబోతోందనే సంకేతం ఇచ్చినట్లవడంతో తెదేపా దానిని సీరియస్ గానే తీసుకొన్నట్లుంది. 

ఇంతవరకు పవన్ కళ్యాణ్ తమకు మిత్రుడిగా ఉన్నందునే ఆయన తెదేపా నేతలను, ఎంపిలను, మంత్రులను, ఏపి  సర్కార్ ను ఎన్ని మాటలు అంటున్నా ఓపికగా భరిస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికలలో ఆయన తమకు సవాలు విసిరే ఆలోచనలో ఉన్నట్లు అనుమానం కలుగగానే, తెదేపా కూడా ఆయనపై మెల్లగా ఎదురుదాడి ప్రారంభించేసింది. 

ఏపి మంత్రి పితాని సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, “ఏపిలో అసలు ఆ పార్టీ (జనసేన) ఉందా? ఉన్నా దాని గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించే ఓపిక, తీరికా మాకు లేవు,” అని అన్నారు. అంటే జనసేనను తాము గుర్తించడంలేదని, గుర్తించినా దాని అవసరం తమకు లేవని చెప్పినట్లు భావించవచ్చు. 

మంత్రి వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ కూడా తనదైన శైలిలో వెంటనే స్పందించారు. “అశోక్ గజపతిగారికి పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు. మంత్రి పితానిగారికి పవన్ కళ్యాణ్ ఏమిటో తెలియదు. సంతోషం,” అని ట్వీట్ చేశారు. 

2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా తెదేపా, భాజపాలకు మద్దతు ఇచ్చి వాటి తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఆ తరువాత ప్రత్యేక హోదా వంటి వివిధ హామీలను అమలుచేయనందుకు కేంద్రాన్ని, వాటి కోసం కేంద్రాన్ని ఒత్తిడి చేయనందుకు తెదేపా ఎంపిలను, భాజపాను పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. 

ఒక సందర్భంలో కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని మీడియాతో అన్నారు. తెదేపా, భాజపాలకు పవన్ కళ్యాణ్ సహాయపడినా అతనెరో తమకు తెలియదని వారు మాట్లాడటంతో పవన్ కళ్యాణ్ కూడా వారికి చాలా ధీటుగానే జవాబిచ్చారు. ఈ విమర్శలు, ప్రతివిమర్శలు జనసేన, తెదేపాల మద్య యుద్ధానికి తొలి సంకేతంగా భావించవచ్చు. అయితే పూర్తిస్థాయి యుద్దం మొదలవడానికి మరికొన్ని నెలలు సమయం పట్టవచ్చు. 


Related Post