మోడీని విమర్శిస్తే తప్పా? ప్రకాష్ రాజ్

October 05, 2017


img

ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, తన ప్రభుత్వం పనితీరుపై బలమైన విమర్శలను సాదరంగా స్వీకరిస్తానని చెప్పారు. 

ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా ఉండటాన్ని తప్పు పడుతూ నటుడు ప్రకాష్ రాజ్ ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. వాటికి భాజపా నేతలు సూటిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయకుండా, ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. 

భాజపా ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ప్రకాష్ రాజ్ ను ఉద్దేశ్యించి, “ఆయనకు సినిమా అవకాశాలు తగ్గిపోయినందున, అందరి దృష్టిని ఆకర్షించడానికే ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్నాటకలో హత్య జరిగితే అక్కడి ముఖ్యమంత్రిని నిలదీయకుండా ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు నిలదీస్తున్నారు?” అని ప్రశ్నించారు. 

అయితే ‘ఈ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు స్పందించడం లేదు?’ అనే ప్రకాష్ రాజ్ ప్రశ్నకు ఆయన కూడా సమాధానం దాటవేశారు. ప్రకాష్ రాజ్ పై లక్నోలో ఒక న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో న్యాయస్థానం ఆయనకు నోటీసు పంపించింది. 

దానిపై స్పందించిన ప్రకాష్ రాజ్, “ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించినా...విమర్శించినా వారిపై దోషిగా ముద్రవేసేయడమేనా? మోడీపై నాకు చాలా గౌరవం ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో ఆయనతో విభేదిస్తాను. అది తప్పని నేను భావించడం లేదు. కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలు మాట్లాడేందుకు భయం ఎందుకు? నేను నిజమే మాట్లాడాను. మాట్లాడుతాను. నేను అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేని కొందరు నన్ను నోటికి వచ్చినట్లు దూషిస్తున్నారు. అయితే వారికి భయపడి నేను నా అభిప్రాయాన్ని మార్చుకోను,” అని అన్నారు.

నోట్ల రద్దు, జి.ఎస్.టి.వంటి నిర్ణయాలను యావత్ ప్రతిపక్షాలతో బాటు భాజపాలోని సీనియర్ నేతలు యశ్వంత్ సిన్హా, శత్రుఘన్ సిన్హా వంటివారు కూడా తప్పు పడుతున్నాయి. వారు స్వంత పార్టీవారే కావడంతో భాజపా నేతలు మౌనం వహించవలసి వస్తోంది. కానీ ఒక జర్నలిస్ట్ హత్యకు గురైతే ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు స్పందించరు? అని ప్రశ్నించినందుకు ప్రకాష్ రాజ్ పై భాజపా శ్రేణులు మూకుమ్మడిగా విరుచుకుపడుతున్నాయి. 

దేశంలో క్రమంగా భావప్రకటన స్వేచ్చకు పరిమితులు విధించబడుతున్నాయంటే భాజపా నేతలకు కోపం వస్తుంది. కానీ ప్రకాష్ రాజ్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తే భాజపా నేతలకు కోపం వస్తోంది. ఆయనపై కేసులు కూడా వేస్తున్నారు. మరి దీనిని ఏమనుకోవాలి?


Related Post