సిఎం కెసిఆర్ కు మోత్కుపల్లి సూచన

October 05, 2017


img

గవర్నర్ పదవి వస్తుందనే ఆశతో చంద్రబాబు నాయుడు సలహా మేరకు గత మూడేళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న తెలంగాణా తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులుకు కేంద్రప్రభుత్వం మళ్ళీ హ్యాండ్ ఇవ్వడంతో తీవ్ర నిరాశ చెందారు. ఈ సందర్భంగా ఒక ప్రముఖ తెలుగు మీడియా ప్రతినిధికి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో రాష్ట్ర రాజకీయాల గురించి తన అభిప్రాయలు చెప్పారు.

 “రాష్ట్రంలో ప్రతిపక్షాలను బలహీనపరచడానికి తెరాస ఫిరాయింపులను ప్రోత్సహించింది. అయితే అంతమందిని తెరాసలో చేర్చుకొన్నా అదేమీ బలపడలేదు. సంస్థాగతంగా నేటికీ బలహీనంగానే ఉంది. నా ఉద్దేశ్యంలో వ్యక్తులు పార్టీలు మారితే వారికి మాత్రమే ప్రయోజనం కలుగుతుంది. అదే..పార్టీలు పొత్తులు పెట్టుకొన్నట్లయితే ఆ పార్టీలకు, వాటిలో ఉన్నవారందరికీ కూడా ప్రయోజనం కలుగుతుంది. ఒకవేళ ఎన్నికలు వస్తే ఇతర పార్టీల మద్దతు తీసుకోకుండా తెరాస తనంతట తానుగా విజయం సాధించలేదని ఖచ్చితంగా చెప్పగలను. తెరాస, కాంగ్రెస్ లతో సహా రాష్ట్రంలో అన్ని పార్టీల పరిస్థితి ఇలాగే ఉంది. కనుక తెరాస వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి రావాలనుకొంటే, ఇతర పార్టీల నేతలను ఫిరాయింపులకు ప్రోత్సహించడం కంటే, తెదేపా, భాజపాలతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడమే ఉత్తమం అని నేను భావిస్తున్నాను. తెలంగాణాలో మా రెండు పార్టీల మద్దతు లేనిదే తెరాస మళ్ళీ అధికారంలోకి రాలేదు. కనుక మా పార్టీ నేతలను తెరాసలోకి ఆకర్షించే కార్యక్రమానికి స్వస్తి చెప్పి, మా రెండు పార్టీలతో పొత్తులు గురించి కేసీఆర్ ఆలోచిస్తే మంచిది.

ఇక ఫిరాయింపుల కారణంగా రాష్ట్రంలో తెదేపా బలహీనపడిందనే వాదన సరికాదు. కొందరు నేతలు పార్టీని వీడి వెళ్ళిపోయినప్పటికీ పార్టీ క్యాడర్ చెక్కుచెదరలేదు. నేటికీ పార్టీలో అనేకమంది బలమైన నేతలున్నారు. కానీ ఒకరిపేరు చెపితే మరొకరికి కోపం వస్తుంది కనుక నేను ఎవరి పేర్లు చెప్పను. తెదేపా, భాజపాల మధ్య కాస్త దూరం పెరిగినప్పటికీ ఎన్నికల సమయానికి అంతా సర్దుకొని మళ్ళీ కలిసే పోటీ చేస్తామని భావిస్తున్నాము. ఏపిలో భాజపాతో పొత్తులు కొనసాగిస్తూ తెలంగాణా వీలుకాదనుకోలేము కదా,” అని అన్నారు.

తెలంగాణాలో తెదేపా కళ్ళు, ముక్కు, నోరు అన్నీ తానే అన్నట్లు వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి గురించి కూడా మోత్కుపల్లి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ రెడ్డి నేతృత్వంలో మీరు పనిచేస్తారా?’ అనే ప్రశ్నకు సమాధానంగా, “నేనా.. రేవంత్ రెడ్డి నేతృత్వంలోనా? ఆ మాట ఎవరైనా అనగలరా? పార్టీలో అందరి కంటే సీనియర్ నాయకుడినైన నేను మరొకరి క్రింద పనిచేయడం కాదు..వారే నా క్రింద పనిచేయాల్సి ఉంటుంది. కానీ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే, అందరం కలిసి పనిచేస్తాము. ఆయన తప్ప పార్టీలో మరెవరూ నన్ను ఆదేశించలేరు. ఒకవేళ నా ఆత్మగౌరవానికి భంగం కలిగితే రాజకీయాలలో నుంచి తప్పుకొంటాను తప్ప పార్టీని పట్టుకొని వ్రేలాడను. కానీ నాకు అటువంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోవడం లేదు.

గవర్నర్ పదవిపై నేను ఎటువంటి ఆశలు పెట్టుకోలేదు కానీ చంద్రబాబునే నమ్ముకొని ఉన్నాను. కనుక ఆ మాట నిలబెట్టుకోవలసిన బాధ్యత ఆయనదే. ఒకవేళ గవర్నర్ పదవి రాకపోతే ఏమి చేయాలనుకొంటున్నానో ఇప్పుడే చెప్పలేను. కానీ నాకు న్యాయం జరుగుతుందనే భావిస్తున్నాను,” అని మోత్కుపల్లి నరసింహులు అన్నారు. 


Related Post