కేసీఆర్ ఆలోచనలు గొప్పవే కానీ...

October 04, 2017


img

నానాటికీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి దేశవిదేశాల నుంచి రోజుకు 400 విమానాలు వచ్చి పోతుంటాయి. ఏడాదికి సుమారు 1.70 కోట్లు మంది ప్రయాణికులు ఆ విమానాశ్రయాన్ని ఉపయోగించుకొంటున్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడక మునుపు ఉన్న రద్దీ కంటే ఈ మూడేళ్ళలో 13.4 శాతం అదనంగా పెరిగింది. శంషాబాద్ విమానాశ్రయం నిర్మించేటప్పుడే 2.5 కోట్లు మంది ప్రయాణికులకు సరిపోయేవిధంగా నిర్మించినందున పెరిగిన రద్దీని తట్టుకోగలుగుతోంది. అయితే ఇదేవిధంగా ఇక ముందు కూడా ప్రయాణికుల రద్దీ, విమానాల సంఖ్య పెరిగినట్లయితే అప్పుడు తప్పకుండా తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక వచ్చే 25ఏళ్ళలో పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకొని అందుకు తగ్గట్లుగా ఇప్పటి నుంచే టెర్మినల్ విస్తరణ, రెండవ రన్ వే నిర్మాణం చేపట్టవలసిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించి నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్ గ్రంథి మల్లికార్జునరావును కోరారు. అందుకు ప్రభుత్వం తరపున అవసరమైన సహాయసహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.

విమానాశ్రయ విస్తరణతో బాటు సమీపంలోనే 600 ఎకరాల విస్తీర్ణంలో ఒక అత్యాధునిక వసతులున్న ఎయిర్ పోర్ట్ సిటీ ని కూడా నిర్మించాలని కోరారు. దానిలో కనీసం 12,000 మందికి సరిపోయేవిధంగా ఒక అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్, స్టార్ హోటల్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, అందమైన పార్కులు, విశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యాలతో విదేశాలను తలపించేవిధంగా నిర్మాణాలు చేపడదామని కేసీఆర్ సూచించారు. విమానాశ్రయం వరకు మెట్రో రైల్ ను పొడిగించేందుకు తమ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తుందని చెప్పారు. 

శంషాబాద్ విమానాశ్రయం ద్వారా వచ్చే ఆదాయంలో ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి 13 శాతం వాటా లభిస్తుంది. 2016-17 సం.లకు రూ.12.28 కోట్లు వచ్చింది. ఆ మొత్తాన్ని చెక్కుద్వారా అందించడానికి జీఎంఆర్ గ్రూపు అధినేత గ్రంథి మల్లికార్జునరావు నిన్న ప్రగతి భవన్ కు వచ్చినప్పుడు విమానాశ్రయ విస్తరణ గురించి చర్చించారు. ఈ సమావేశంలో  ఆ సంస్థ ప్రతినిధులు, విమానాశ్రయ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, జి.హెచ్.ఎం.సి. అధికారులు పాల్గొన్నారు. 

విమానాశ్రయ విస్తరణ అనేది మంచి ఆలోచనే కానీ దానికి కేంద్రప్రభుత్వ అనుమతులు, ఆర్ధిక సహాయసహకారాలు అవసరం. మెట్రో రైల్ పొడిగింపుకు కూడా అదే వర్తిస్తుంది. వీటితో పోలిస్తే 600 ఎకరాలలో అత్యాధునిక హంగులతో ఎయిర్ పోర్ట్ సిటీ నిర్మాణం పూర్తి చేయడం సులువేనని చెప్పవచ్చు. ఎందుకంటే వాటికి అవసరమైన భూమి ఇతర సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తే, అక్కడ పెట్టుబడులు పెట్టి నిర్మాణాలు చేపట్టడానికి అనేక సంస్థలు పోటీపడతాయి. అయితే ఏదో ఒకనాడు విమానాశ్రయ విస్తరణ, అదనపు రన్ వే నిర్మాణం గురించి ఆలోచించి, పనులు మొదలుపెట్టక తప్పదు కనుక ఆ దిశలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి అడుగు వేయడం మంచిదే. కానీ ఆలోచనలు ఆచరణలోకి రావడానికి ఎన్నేళ్ళు పడుతుందో చూడాలి. 


Related Post