సింగరేణి ఎన్నికల తాయిలాలు

October 04, 2017


img

సింగరేణి కార్మిక సంఘాలకు రేపు అంటే గురువారం ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న తెరాస సర్కార్ కార్మికులను ఆకర్షించి విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. అందుకోసం గత నెలరోజులుగా సింగరేణి కార్మికులకు అనేక హామీలు, తాయిలాలు ప్రకటిస్తూనే ఉంది. మళ్ళీ నిన్న మరో తాయిలం ప్రకటించింది. భద్రాది కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు పట్టణంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నివాసాలు ఏర్పాటు చేసుకొన్న పేదవారికి వాటిపై యాజమాన్య హక్కు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఒక్కొక్క కుటుంబానికి 100 గజాలలోపు భూమిని ఉచితంగా క్రమబద్ధీకరించడానికి వీలుకల్పిస్తూ రెవెన్యూ శాఖ నిన్న జీవో: 224 జారీ చేసింది. ఆ జీవో ప్రకారం ఇల్లెందు పట్టణంలో 8,010 మంది పేదలు ఆక్రమించుకొన్న 19,15,975గజాల స్థలాన్ని వారి పేరిట ఉచితంగా రిజిస్టర్ చేయబడుతుంది. అందుకు రెవెన్యూ శాఖ కొన్ని నిబంధనలు విదించింది.  

వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు. తాము ఉంటున్న నివాసాలకు కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఆస్తిపన్ను రశీదులు లేదా ఆ స్థలం తమ అధీనంలో ఉన్నట్లు ఎటువంటి ఆధారాలైనా చూపవలసి ఉంటుంది. నిరుపేదలకే కాకుండా దారిద్యరేఖకు ఎగువన ఉండేవారికి కూడా 100-500 గజాల వరకు స్థలాలను గజం రూ.8 లకు క్రమబద్దీకరిస్తారు. అదే 500 గజాల లోపున్న వాణిజ్య స్థలాలైతే గజానికి రూ.15 చొప్పున చార్జీలు తీసుకొని క్రమబద్దీకరిస్తారు. 

నిరుపేదలకు కూడు, గుడ్డ ఇల్లు ఏర్పాటుచేయడం అభినందనీయమైన విషయమే. కానీ రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వ భూములను ఆక్రమించుకొన్నవారికి ఈవిధంగా క్రమబద్దీకరించాలనుకోవడం సరికాదు. ప్రభుత్వ భూములను కాపాడవలసిన ప్రభుత్వమే ఈవిధంగా చేయడం వలన ప్రభుత్వ భూములు ఆక్రమించుకొనే వారిని ప్రభుత్వంమే ప్రోత్సహిస్తున్నట్లవుతుంది.

పేదలకు 100 గజాల క్రమబద్దీకరణకే పరమితం కాకుండా దారిద్యరేఖకు ఎగువన ఉండేవారికి కూడా 100-500 గజాల వరకు స్థలాలను, అదేవిధంగా 500 గజాల లోపున్న వాణిజ్య స్థలాలను క్రమబద్దీకరించాలనుకోవడం సరికాదు. ఇటువంటి సందర్భాలలో ఇటువంటి అవకాశాలు వస్తాయనే ఉద్దేశ్యంతో రాజకీయనేతలు, కార్యకర్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తదితరులు కనబడిన ప్రభుత్వ భూములన్నిటినీ కబ్జా చేసే ప్రమాదం ఉంది. అయినా కార్మిక సంఘాల ఎన్నికలను కూడా ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవలసిన అవసరం ఉందా? దాని కోసం ఇటువంటి తాయిలాలు పంచిపెట్టడం సబబేనా? అని తెరాస సర్కార్ ఆలోచిస్తే బాగుంటుంది. 


Related Post