రాహుల్ పట్టాభిషేకం..జరుగుతుందా?

October 04, 2017


img

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఈ నెల 25న ఎన్నికలు జరుగబోతున్నాయి. దానికి ఈనెల 10 నుంచి నామినేషన్స్ ప్రక్రియ మొదలవుతుంది. ప్రస్తుతం ఆ పార్టీ ఉపాధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీయే ఆ పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు కనుక పార్టీలో ఎవరూ ఆయనపై పోటీ చేసేందుకు సిద్దపడకపోవచ్చు. అప్పుడు అయన ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. అయితే ఆయన నాయకత్వం, సమర్ధతపై పార్టీలో కొంతమంది సీనియర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున వారిలో ఎవరైనా ఆయనతో పోటీకి దిగినా ఆశ్చర్యం లేదు. అప్పుడు అధ్యక్ష పదవికి ఎన్నికలు తప్పవు. కానీ అటువంటి పరిస్థితి వచ్చినా, ఆ ఎన్నికలలో రాహుల్ గాంధీ ఓడిపోయినా అది కాంగ్రెస్ పార్టీకి, ఆయనకు చాలా అవమానం, అప్రదిష్ట కలిగిస్తుంది. కనుక రాహుల్ గాంధీపై ఎవరూ పోటీ చేయకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈనెల నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికవుతారా లేదా అనే విషయంపై స్పష్టత వస్తుంది.

ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ అధ్యక్షుడుగా ఎన్నికైతే, ఆయన సోదరి ప్రియాంకా వాద్రాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తద్వారా రాహుల్ గాంధీ గౌరవానికి భంగం కలుగకుండా జాగ్రత్త పడుతూ మరోపక్క కాంగ్రెస్ పార్టీకి మంచి బలమైన నాయకత్వం అందించాలని సోనియా గాంధీ భావిస్తున్నట్లు సమాచారం.   

కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీయే అధ్యక్షుడు కావాలని భాజపా కూడా కోరుకోవడం విశేషం. అతని శల్యసారధ్యంలో నడిచే కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికలలో అవలీలగా ఓడించవచ్చని భాజపా భావిస్తోంది.


Related Post