మోడీ నిర్ణయం మంచిదే..

September 25, 2017


img

ప్రధాని నరేంద్ర మోడీ ఒక ఆర్ధిక సలహాదారుల మండలిని ఏర్పాటు చేసుకొన్నారు. ప్రముఖ ఆర్ధికవేత్త బిబేక్ దేబ్ రాయ్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన మండలిని ఏర్పాటు చేశారు. దానిలో ప్రముఖ ఆర్ధికవేత్తలు సుర్జీత్ భల్లా, రథిన్ రాయ్, ఆషిమా గోయల్, రతన్ వతల్ సభ్యులుగా ఉంటారు. దేశ ఆర్ధికవ్యవస్థను ప్రభావితం చేసే వివిధ అంశాలపై చర్చించుకొని, దేశ ఆర్ధికాభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలను ప్రధాని నరేంద్ర మోడీకి ఇస్తుంటారు. 

నోట్లరద్దుతో దేశ ఆర్ధిక వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి పరుగులు పెట్టిద్దామని ప్రధాని నరేంద్ర మోడీ అనుకొంటే, అందుకు పూర్తి విరుద్దంగా జరిగింది. నోట్లరద్దు కారణంగా దేశంలో వివిధ రంగాలు దాదాపు స్తంభించిపోయి...తీవ్ర నష్టాలబారిన పడ్డాయి. నేటికీ అనేక రంగాలు కోలుకోలేకపోతున్నాయి. నోట్లరద్దు దెబ్బకే విలవిలలాడుతున్న మార్కెట్లపై జి.ఎస్.టి. మరో పిడుగులాగ వెంటనే వచ్చి పడింది. ఒకదాని వెంట మరొకటి వరుసగా పడిన ఈ దెబ్బలకు దేశ ఆర్ధిక పురోగతి కూడా నెమ్మదించిపోయింది. 

నోట్లరద్దును గట్టిగా వ్యతిరేకిస్తూ, దానివలన తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని మొదటి నుంచి హెచ్చరిస్తున్న ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కేంద్రప్రభుత్వానికి పుండు మీద కారం చల్లినట్లవుతోంది. జరిగిన తప్పులన్నిటినీ సరిదిద్దుకొని, ఎదురైన ఈ సమస్యలన్నిటినీ అధిగమించి మళ్ళీ దేశ ఆర్ధిక వ్యవస్థను పరుగులు పెట్టించడం కోసం మోడీ ఈ ఆర్ధిక సలహా మండలిని ఏర్పాటు చేసుకొన్నారు. నిజానికి ఈ పని ఆయన మొదటే చేసి ఉండి ఉంటే ఈ మూడేళ్ళలో అద్భుతమైన ఫలితాలు కనబడేవి. ఏమైనప్పటికీ ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకొన్నారని చెప్పకతప్పదు.


Related Post