డిల్లీకి తమిళనాడు అర్ధం కాదు: కమల్

September 25, 2017


img

త్వరలో రాజకీయాలలోకి ప్రవేశించబోతున్న ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ చాలా దూకుడుగా మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన మళ్ళీ ఈరోజు అనేక అంశాలపై తన అభిప్రాయాలను కుండబ్రద్దలుకొట్టినట్లు వివరించారు. ఈ ఏడాది చివరిలోగా తప్పకుండా తాను పార్టీ స్థాపించడం ఖాయమని, అందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. అతి త్వరలోనే తేదీని ప్రకటిస్తానని చెప్పారు. 

జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపాలకు తమిళనాడు ప్రజల ఆలోచనలు, వారి భావోద్వేగాలు అర్ధంకావని, అలాగే డిల్లీ పాలకులు తమ పట్ల సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తుంటారో తమిళనాడు ప్రజలకు కూడా అర్ధం కావడంలేదని, అందుకే ఆ రెండు పార్టీలు ఎంత ప్రయత్నించినా తమిళనాడులో కాలుపెట్టలేకపోతున్నాయని అన్నారు. 

ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మద్య కనబడని ఒక విభజన రేఖ ఎప్పుడూ ఉంటూనే వచ్చిందని, దానిని ఏ జాతీయ పార్టీ చేరిపేందుకు గట్టిగా ప్రయత్నించకపోవడంతో వాటి మద్య ఆ దూరం అలాగే ఉండిపోయిందని కమల్ హాసన్ అన్నారు. మోడీ చెపుతున్న ‘అచ్చే దిన్’ తమిళనాడుకు ఇంకా ఎప్పుడు వస్తాయా..అని ఎదురుచూస్తున్నానని చెప్పారు. 

తన సహా నటుడు రజనీకాంత్ అంటే తనకు చాలా గౌరవం, అభిమానం అని చెపుతూనే ఆయనకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ కనుక నాతో కంటే భాజపాతోనే సులువుగా ఇమడగలరని భావిస్తున్నానని చెప్పారు. కమల్ హాసన్ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన వెంటనే, మోడీ సర్కార్ చేపట్టిన ‘స్వచ్చాతాహి సేవా’ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లు రజనీకాంత్ ట్వీట్ చేశారు. బహుశః దానిని దృష్టిలో పెట్టుకొనే కమల్ హాసన్ ఈవిధంగా అని ఉండవచ్చు. 

తన ఆలోచనలు వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉన్నప్పటికీ దానర్ధం వామపక్షాలతో  చేతులు కలుపుతానని అనుకోనవసరం లేదని కమల్ హాసన్ స్పష్టం చేశారు. ఇంతకాలం రాష్ట్రాన్ని పాలించిన డిఎంకె, అన్నాడిఎంకె పార్టీలు రెండూ అవినీతి పార్టీలే అని కమల్ హాసన్ కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. 


Related Post