వారసత్వ ఉద్యోగాలపై హోరేత్తిస్తున్న తెరాస

September 25, 2017


img

వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టు, సుప్రీంకోర్టు స్టే విధించిన తరువాత ప్రతిపక్షాలు, సింగరేణి కార్మికులు ఎంతగా మొత్తుకొన్నా..ఎన్ని విమర్శలు చేసినా నోరుమెదపని తెరాస నేతలు, ఇప్పుడు సింగరేణి కార్మిక సంఘాలకు ఎన్నికలు ముంచుకు రావడంతో వారసత్వ ఉద్యోగాల గురించి హోరెత్తించేస్తుండటం విశేషం. 

తెలంగాణా బొగ్గుగని కార్మికుల సంఘం గౌరవాధ్యక్షురాలు ఎంపి కవిత మాట్లాడుతూ, కేంద్రరాష్ట్రాలలో అధికారంలోలేని పార్టీలు వారసత్వ ఉద్యోగాలను ఏవిధంగా సాధిస్తాయో చెప్పాలని సవాలు విసిరారు. అయితే అధికారంలో ఉన్న తాము ఇంతకాలం ఎందుకు వాటిని సాధించలేకపొయామో...ఇకముందు ఏవిధంగా సాధించగలమో..వివరించడం లేదు కానీ ఇప్పుడు తమ అనుబంధ కార్మిక సంఘానికి ఓటు వేస్తే తప్పకుండా వారసత్వ ఉద్యోగాలను సాధిస్తామని గట్టిగా హామీ ఇస్తున్నారు. 

తెరాస ఎంపి బాల్క సుమన్ కూడా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు కేవలం తమ ప్రభుత్వం వల్లనే వారసత్వ ఉద్యోగాలు సాధ్యమని గట్టిగా చెప్పారు. అయితే ఇంతకాలం ఈ సమస్యపై ఎందుకు నోరు మెదపలేదో తెలియదు. 

ఇక తమ రాజకీయ ప్రత్యర్ధ పార్టీలను బలహీనపరచడానికి తెరాస ఏవిధంగా ఇతర పార్టీల నేతలను, ఎమ్మెల్యేలను తెరాసలోకి ఫిరాయింపజేసిందో, అలాగే సింగరేణి యూనియన్ ఎన్నికలలో కూడా ఇతర సంఘాలను బలహీనపరిచి వాటిని ఓడించడానికి వాటి నేతలను తమ సంఘంలోకి ఫిరాయింపజేయడం చాలా విచారకరం. 

రైతు సంఘాలలో, కార్మిక సంఘాలలో, విద్యార్ధి సంఘాలలో...ఇలాగ ప్రతీచోట తెరాస తప్ప మరొకటి ఉండకూడదన్నట్లు వ్యవహరించడం, కేవలం తాము మాత్రమే తెలంగాణాకు, ప్రజలకు మేలు చేస్తున్నాము..చేయగలమన్నట్లు మాట్లాడటం ప్రజాస్వామ్యవిధానాలకు, స్పూర్థికే విరుద్దం. భారత టెలికాం కంపెనీ రంగంలో ప్రవేశించిన జియో ఏవిధంగా విద్వంసం సృష్టించి ఏకచత్రాధిపత్యం వహించాలని ప్రయత్నిస్తోందో తెరాస కూడా అదేవిధంగా చేస్తోందని చెప్పక తప్పదు.

 అయితే ప్రజాస్వామ్యవ్యవస్థలో ఇటువంటి అప్రజాస్వామిక ఆలోచనలు, ఎత్తులు ఎల్లకాలం సాగవని గతంలో అనేకసార్లు నిరూపితమైంది. కనుక తెరాస కూడా ప్రజాస్వామ్య విధానాలను గౌరవిస్తూ వాటికి అనుగుణంగా ముందుకుసాగినట్లయితే, ప్రజాధారణ పెరిగి ఎక్కువ కాలం అధికారంలో ఉండే అవకాశం లభిస్తుంది.


Related Post