చిత్తశుద్ధిలేని పోరాటాలతో సాధించేది ఏమిటి?

September 25, 2017


img

రాజకీయ పార్టీలకు ప్రజాసమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉన్నాలేకపోయినా ఉన్నట్లు నటిస్తుండాలి. ముఖ్యంగా   ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ నటించాల్సి ఉంటుంది. నిత్యం ఏదో ఒక సమస్యను తీసుకొని దానిపై ధర్నాలు, రాస్తా రోకోలు, సభలు, సమావేశాలు అంటూ హడావుడి చేయకతప్పదు. అప్పుడే ప్రజలు వారిని మరిచిపోకుండా గుర్తుంచుకొంటారు. 

అయితే సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ మధమెక్కిన ఏనుగువలే ప్రవర్తించడం సహజమే కనుక దానిని నియంత్రించేందుకు ప్రతిపక్షమనే అంకుశం కూడా అవసరమే. కనుక అవి చేసే హడావుడి అంతా ప్రజాసమస్యల పరిష్కారం కోసమేనని సర్ది చెప్పుకోక తప్పడం లేదు. కానీ అవి కూడా ఏ సమస్యపై ఎక్కువ కాలం పోరాటం కొనసాగించలేవనే సంగతి అందరికీ తెలుసు. 

ఇంతకీ విషయం ఏమిటంటే, బైసన్ పోలో గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మించాలని నిర్ణయించుకొన్నారు. కనుక రాష్ట్ర కాంగ్రెస్ నేతలు దానిని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. 

ప్రస్తుతం ఉన్న సచివాలయంలోనుంచి ఆంధ్ర సర్కార్ తన ఉద్యోగులను, కార్యాలయాలను తరలించుకొనిపోవడంతో ఇప్పుడు మొత్తం సచివాలయ భవనాలన్నీ తెలంగాణా ప్రభుత్వం అధీనంలోకే వస్తాయి. కనుక అవసరానికిమించిన స్థలం, కార్యాలయాలు లభిస్తాయి. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తు పిచ్చితో బైసన్ పోలో గ్రౌండ్స్ లో కొత్త సచివాలయం నిర్మించాలనుకోవడాన్ని వి హనుమంతరావు తప్పు పట్టారు. 

ప్రతీదానిపై తన ముద్ర ఉండాలనే కోరికతో ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకొంటున్నారని విమర్శించారు. ఒకప్పుడు యావత్ సమైక్య రాష్ట్రానికి సరిపోయిన సచివాలయం ఇప్పుడు తెలంగాణా రాష్ట్రానికి ఒకదానికీ ఎందుకు సరిపోదని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసి కేసీఆర్ తన కోసం విలాసవంతమైన ప్రగతి భవన్ ను నిర్మించుకొన్నారని ఆరోపించారు. ఇప్పుడు వందల కోట్లు ఖర్చు చేసి కొత్త సచివాలయం నిర్మించడానికి సిద్దం అవుతున్నారని దానిని కాంగ్రెస్ పార్టీ గట్టిగా అడ్డుకొంటుందని వి హెచ్చరించారు. కొత్త సచివాలయం నిర్మాణంపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ మంగళవారం హైదరాబాద్ జంట నగరాలలో 20 ప్రాంతాలలో ప్రజాబ్యాలెట్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. దాని ఆధారంగా తాము ఈ విషయంలో ముందుకు సాగుతామని వి హనుమంతరావు చెప్పారు. 

ఈ విషయంలో వి హనుమంతరావు వాదనలు సహేతుకంగానే ఉన్నప్పటికీ, కాంగ్రెస్ నేతల పోరాటం కొత్త సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం కోసం కాకుండా తమ ఉనికిని చాటుకోవడం కోసమే అన్నట్లు హడావుడి చేసి ఆ మరునాడు మరో అంశం లేదా సమస్యకు షిఫ్ట్ అయిపోవడం ఖాయం. కనుక వారు చేస్తున్న పోరాటంపై వారికే చిత్తశుద్ధి లేనప్పుడు ఇక ప్రజలు వారిని ఎందుకు నమ్ముతారు? చిత్తశుద్ధిలేని పోరాటాలతో వారు కొత్తగా సాధించేదేమీ ఉండకపోగా అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారనే తెరాస నేతల విమర్శలు భరించక తప్పదు. 


Related Post